Purane:  పుజారా పేరులోని మొదటి అక్షరాన్ని.. రహానే పేర్లోని తొలి, చివరి అక్షరాన్ని కలిపి ‘పురానే’ (పాతబడొపోయిన అని అర్థం వచ్చేలా) అని పిలుస్తూ ఇద్దరినీ ఓ ఆటాడుకుంటున్నారు. 

గత కొద్దికాలంగా వరుసగా విఫలమవుతున్న భారత టెస్టు మిడిలార్డర్ ద్వయం అజింక్యా రహానే, ఛటేశ్వర్ పుజరాలపై టీమిండియా క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని అవకాశాలిచ్చినా ఉపయోగించుకోని ఈ ఇద్దరు సీనియర్లపై మండిపడుతున్నారు. ఏడాదిన్నర కాలంగా ఫామ్ లేమితో తంటాలు పడుతున్నా.. జట్టుకు భారంగా మారుతున్నా అవకాశాలిస్తుండటంపై పరోక్షంగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)పై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘ఇక మీ సేవలకో దండం.. దయచేయండి...’ అంటూ ట్విట్టర్ లో ట్రోల్ చేస్తున్నారు. పుజారా పేరులోని మొదటి అక్షరం, రహానే లోని తొలి, చివరి అక్షరాన్ని కలిపి ‘పురానే’ (పాతబడొపోయిన అని అర్థం వచ్చేలా) అని పిలుస్తూ ఇద్దరినీ ఓ ఆటాడుకుంటున్నారు. 

సఫారీ గడ్డ మీద జరుగుతున్న టెస్టు సిరీస్ లో పుజారా, రహానే ల ఫామ్ అభిమానులకు చిరాకు తెప్పిస్తున్నది. తొలి టెస్టు లో పుజారా డకౌట్ కాగా.. ఇప్పుడు ఆ వంతు రహానేది. విరాట్ కోహ్లి గైర్హాజరీలో అంతగా అనుభవం లేని కెఎల్ రాహుల్ సారథ్యంలో బాధ్యతగా ఆడాల్సిన వీళ్లిద్దరూ పేలవ ప్రదర్శన చేయడంపై అభిమానులు ఫైర్ అవుతున్నారు. స్వదేశంలో జరిగిన న్యూజిలాండ్ తో సిరీస్ లో రహానే, పుజారాలు విఫలమైనా అవకాశాలిచ్చిన జట్టు యాజమాన్యం ఆశలను వాళ్లు అడియాసలు చేశారు. 

Scroll to load tweet…

సెంచూరియన్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో పుజారా డకౌట్ కాగా రెండో ఇన్నింగ్స్ లో కూడా 16 పరుగులే. ఇక అదే టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్ లో 48 పరుగులతో ఫర్వాలేదనిపించిన రహానే.. రెండో ఇన్నింగ్స్ లో 20 పరుగులే చేశాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఈ ఇద్దరి స్కోర్లు వరుసగా 3, 0. 

Scroll to load tweet…

దీంతో ఈ ఇద్దరి ఆటతీరుపై ట్విట్టర్ లో నెటిజన్లు ఓ ఆటాడుకుంటున్నారు. ఈ ఇద్దరి పేర్లను కలిపి ‘పురానే’గా పేర్కొంటూ కామెంట్లు పెడుతున్నారు. ‘పురానేకు వీడ్కోలు చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది..’, ‘పుజారా, రహానేను పక్కనబెట్టి వారి స్థానంలో యువ ఆటగాళ్లకు అవకాశమివ్వాలి..’, ‘పుజారా, రహానే లు పురానే అయ్యరు’, ‘నాలాగే నువ్వు కూడా ఔటవ్వు.. రహానేతో పుజారా..’, ‘మీ ఇద్దరూ స్నేహానికి విలువ ఇస్తారని మాకు తెలుసు. పుజారా ఔటైన వెంటనే రహానే కూడా పెవిలియన్ కు వెళ్లి అతడిని హగ్ చేసుకున్నాడు. నిజమైన స్నేహమంటే మీదే..’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

ఇదిలాఉండగా.. వాండరర్స్ టెస్టులో టీమిండియా తీవ్ర కష్టాల్లో పడింది. వరుస వికెట్లు పడుతున్న క్రమంలో హాఫ్ సెంచరీ చేసి ఆదుకుంటాడనుకున్న తాత్కాలిక సారథి కెఎల్ రాహుల్ (50) ఔటయ్యాడు. 51 ఓవర్లు ముగిసేసరికి భారత్ 5 వికెట్లు కోల్పోయి 146 పరుగులు మాత్రమే చేసింది. క్రీజులో రిషభ్ పంత్ (32 బంతుల్లో 13 నాటౌట్), రవిచంద్రన్ అశ్విన్ (21 బంతుల్లో 24 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఒలివర్, జాన్సేన్ లు తలో రెండు వికెట్లు పడగొట్టారు.