టీమిండియా కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ.. ప్రస్తుత క్రికెట్‌లో వరుస రికార్డులను తన ఖాతాలో వేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. రికార్డుల విషయంలో అతని దరిదాపుల్లోకి కూడా ఎవరు వచ్చే ప్రసక్తే లేదంటే అతిశయోక్తి కాదు.

అటువంటి కోహ్లీనే అధిగమించింది భారత మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్ స్మృతీ మంథాన. వన్డే ఫార్మాట్‌లో వేగవంతంగా రెండు వేల పరుగుల్ని పూర్తి చేసుకున్న రెండో భారత క్రికెటర్‌గా స్మృతీ రికార్డుల్లోకి ఎక్కారు. ఈ విషయంలో ఆమె కంటే విరాట్ కోహ్లీ వెనుకబడ్డారు.

మంథాన కంటే ముందు టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఈ ఘనత సాధించాడు. గబ్బర్ 48 ఇన్నింగ్సుల్లోనే 2 వేల పరుగుల మార్క్‌ను అందుకుని అగ్రస్థానంలో నిలవగా.. మంథాన 51 ఇన్నింగ్సులు తీసుకున్నారు. ఇక విరాట్ కోహ్లీ విషయానికి వస్తే అతను 2 వేల పరుగుల్ని అందుకోవడానికి 53 ఇన్నింగ్సులు ఆడాల్సి వచ్చింది.

Also Read:యూవీ ఎమోషనల్ బర్త్ డే విష్ కి స్పందించిన విరాట్ కోహ్లీ

భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ 52 ఇన్నింగ్సుల్లో రెండు వేల పరుగుల మార్క్‌ను అందుకున్నారు. పురుషుల విభాగంలో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు హషీమ్ ఆమ్లా 40 ఇన్నింగ్సుల్లోనే ఈ ఘనత సాధించాడు.

వెస్టిండీస్ మహిళా జట్టుతో మూడు వన్డేల సిరీస్‌‌లో భాగంగా బుధవారం రాత్రి జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా రెండు వికెట్ల తేడాతో విజయం సాధించి 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

Also Read:అప్పుడు ధోనీ... ఇప్పుడు కోహ్లీ... గంగూలీ సారధ్యంపై భజ్జీ కామెంట్స్

మూడో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. స్టిఫానీ టేలర్ 79, స్టాసీ అన్ కింగ్ 38 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 42.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.

ఓపెనర్లు స్మృతీ మంథాన 74, జెమిమా రోడ్రిగ్స్ 69 పరుగులతో వీరవిహారం చేయడంతో మిథాలీ సేన సునాయసంగా విజయం సాధించింది. కాగా కాలి గాయం కారణంగా జట్టుకు దూరమైన స్మృతీ మంథాన కొద్దిరోజులుగా జట్టుకు దూరమయ్యారు. విండీస్ సిరీస్‌లో తొలి రెండు వన్డేల్లో ఆడనప్పటికీ నేరుగా మూడో మ్యాచ్‌లో అడుగుపెట్టి భారత విజయంలో కీలకపాత్ర పోషించారు.