సౌరవ్ గంగూలీ ఇటీవల బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవం అయ్యారు. అధ్యక్షుడి బాధ్యతలు  చేపట్టిన నాటి నుంచి జట్టును మరింత ముందుకు సాగేలా చర్యలు తీసుకునేందుకు గంగూలీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా... ఆయన బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం పట్ల తొలిసారిగా హర్భజన్ సింగ్ స్పందించారు.

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వేసిన బాటలోనే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ జట్టును ముందుకు తీసుకెళ్లాడు. ఇప్పుడు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అదే బాటలో విజయాలతో దూసుకెళ్తున్నాడు అని టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్‌ సింగ్‌ పేర్కొన్నాడు. కష్టసమయాలలో జట్టు పగ్గాలు చేపట్టి టీమిండియా రూపురేఖలనే మార్చిన గంగూలీ.. అధ్యక్షుడిగా భారత క్రికెట్‌ను అభివృద్ధి దిశగా మరింత ముందుకు తీసుకెళుతాడని హర్భజన్‌ ధీమా వ్యక్తం చేశాడు.

గంగూలీ టీమిండియాకి గొప్ప నాయకుడని భజ్జీ పేర్కొన్నాడు. దాదాతో కలిసి తాను మైదానంలో ఆడానని... ఆ సమయంలో తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని ఈ సందర్భంగా చెప్పాడు. అతని కెప్టెన్సీలో టీమిండియా సరైన మార్గంలో పయనించిందని అభిప్రాయపడ్డారు. జట్టును అద్భుతంగా ముందుకు నడిపించాడన్నారు. గంగూలీ వేసిన బాటలోనే ధోనీ జట్టును ముందకు తీసుకువెళ్లాడన్నారు. ఇప్పుడు విరాట్ కోహ్లీ  కూడా అదే చేస్తున్నాడని భజ్జీ పేర్కొన్నాడు.

ఇప్పటికే దాదా తనేంటో నిరూపించుకున్నాడని... ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడిగా మరోసారి తన సత్తా చాటుకుంటాడని అభిప్రాయపడ్డాడు. భారత  క్రికెట్ అభివృద్ధి దిశగా దూసుకెళ్లే మార్గాన్ని సిద్ధం చేసుకున్నాడన్నాడు. అతని వారసత్వంలో భారత క్రికెట్ గొప్ప స్థానన్ని  చేరుకుంటుందని చెప్పాడు. బాధ్యతలు చేపట్టిన కొన్ని రోజుల్లోనే దాదా తన మార్క్ చూపించాడంటూ ప్రశంసలు కురిపించాడు.

ధోనీ, కోహ్లీ కెప్టెన్సీలో భారత్ ఎన్నో విజయాలు సాధించిందని చెప్పాడు. ఇద్దరి కెప్టెన్సీ శైలి భిన్నంగా ఉన్నా... అంతిమ లక్ష్యం  మాత్రం జట్టును గెలిపించడమేనని ఆయన అన్నాడు. యువ ఆటగాళ్లను వారు ఎంతో ప్రోత్సహించారని గుర్తు  చేశాడు.