బ్యాటింగ్, బౌలింగ్ తో అదరగొట్టి సూపర్-8లో బోణి కొట్టిన టీమిండియా
Ind vs Afg : ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన సూపర్-8 తొలి మ్యాచ్ లో టీమిండియా సూపర్ విక్టరీ సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ లో భారత జట్టు ఆల్ రౌండ్ ప్రదర్శనతో సూపర్-8లో మొదటి విజయాన్ని అందుకుంది.
India vs Afghanistan : టీ20 వరల్డ్ కప్ 2024 సూపర్-8లో తన తొలి మ్యాచ్ లో టిమిండియా సూపర్ విక్టరీ అందుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ లో అద్భుత ప్రదర్శన చేసింది. బ్యాటింగ్ లో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీలు రాణించారు. బౌలింగ్ లో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్ దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ లు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లను చెడుగుడు ఆడుకున్నారు. దీంతో టీమిండియా ఆఫ్ఘన్ జట్టుపై 47 పరుగుల తేడాతో సూపర్-8 లో తొలి విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. ఛేజింగ్ లో ఆఫ్ఘన్ టీమ్ 20 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 134 పరుగులు మాత్రమే చేయగలిగింది.
గురువారం బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ సూపర్ 8 మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్-భారత్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకుంది రోహిత్ సేన. టీమిండియా ఓపెనింగ్ ను మరోసారి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ప్రారంభించారు. విరాట్ కోహ్లీ కాస్త టచ్ లో కనిపించాడు. 24 పరుగులు చేశాడు కానీ, పెద్ద ఇన్నింగ్స్ ను గా మార్చలేకపోయాడు. రోహిత్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. 8 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. టీ20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్ అద్భతమైన ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. ఆఫ్ఘన్ బౌలింగ్ ను చిత్తు చేస్తూ కేవలం 28 బంతుల్లో 53 పరుగులతో అదరిపోయే హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు.
సూర్యకుమార్‌తో పాటు రిషబ్ పంత్ (11 బంతుల్లో 20), హార్దిక్ పాండ్యా (24 బంతుల్లో 32) కూడా భారత్ స్కోరుకు విలువైన సహకారం అందించారు. దీంతో టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టిన రషీద్ ఖాన్ 3 వికెట్లు తీసుకున్నాడు. అలాగే, ఈ వరల్డ్ కప్ లో అదరగొడుతున్న ఫజల్హక్ ఫారూఖీ కూడా 3 వికెట్లు తీసుకున్నాడు. 182 పరుగుల ఛేజింగ్ తో బరిలోకి దిగిన ఆఫ్ఘన్ కు ఆరంభం నుంచి కష్టాలు పెరిగాయి. భారత బౌలర్లు అదరగొట్టడంతో వరుసగా వికెట్లు కోల్పోయారు. అర్ష్ దీప్ సింగ్ 3 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీసుకున్నారు. అలాగే, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలు చెరో వికెట్ తీసుకున్నారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో ఆలౌట్ అయి 134 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్ పై 47 పరుగుల తేడాతో గెలిచింది.
సూర్యకుమార్ యాదవ్ పిక్చర్ ఫర్‌ఫెక్ట్ షాట్స్.. అదిరిపోయిందిగా..