సూర్యకుమార్ యాదవ్ పిక్చర్ ఫర్‌ఫెక్ట్ షాట్స్.. అదిరిపోయిందిగా..
Ind vs Afg - Suryakumar Yadav : ఆఫ్ఘనిస్తాన్ పై అదిరిపోయే హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు సూర్యకుమార్ యాదవ్. హార్ధిక్ పాండ్యాతో కలిసి భారత స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఇక బౌలింగ్ లో మనోళ్లు అందరూ అదరగొట్టారు.
India vs Afghanistan : గురువారం బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ సూపర్ 8 మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్-భారత్ జట్లు తలపడ్డాయి. మరోసారి ఆఫ్ఘన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఎట్టకేలకు భారత్‌పై ప్రభావం చూపగలిగాడు. అయితే, టీ20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్ అద్భతమైన ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. ఆఫ్ఘన్ బౌలింగ్ ను చిత్తు చేస్తూ కేవలం 28 బంతుల్లో 53 పరుగులతో అదరిపోయే హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. మరీ ముఖ్యంగా తన ఇన్నింగ్స్ లో అద్భుతమైన షాట్స్ ఆడాడు. స్ట్రెయిట్ గా కొట్టిన సిక్సర్లు పిక్చర్ ఫర్‌ఫెక్ట్ షాట్స్ అని చెప్పాలి. సూపర్ ఫోజులో క్రికెట్ హిస్టరీలో నిలిచిపోయే సిక్సర్లు బాదాడు.
దీంతో భారత జట్టు 8 వికెట్లు కోల్పోయి 20 ఓవర్లలో 181 పరుగులు చేసింది. ఛాలెంజింగ్ పిచ్‌పై అదిరిపోయే బౌండరీలు కొట్టిన సూర్యకుమార్ ఇన్నింగ్స్ అతని ట్రేడ్‌మార్క్ శైలిని ప్రదర్శించింది. సూర్యకుమార్‌తో పాటు రిషబ్ పంత్ (11 బంతుల్లో 20), హార్దిక్ పాండ్యా (24 బంతుల్లో 32) కూడా భారత్ స్కోరుకు విలువైన సహకారం అందించారు. మరోసారి నిరాశపరిచిన విరాట్ కోహ్లీ కాస్త టచ్ లోకి వచ్చాడు. విరాట్ కోహ్లి (24 బంతుల్లో 24) టోర్నమెంట్‌లో తొలిసారి రెండంకెల స్కోరును అందుకున్నాడు.
భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టిన రషీద్ ఖాన్, తన మొదటి మూడు ఓవర్లలో మూడు కీలక వికెట్లు పడగొట్టి, 3/26తో తన బౌలింగ్ ను ముగించాడు. తొలుత టీమిండియా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.. కానీ పిచ్ పరిస్థితులు బ్యాట్స్‌మెన్లను ఇబ్బంది పెట్టింది. బౌండరీలు కొట్టడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. స్కోరింగ్ రేటు పెంచేందుకు ప్రయత్నించిన కెప్టెన్ రోహిత్ శర్మ (8) ఆరంభంలోనే ఔట్ అయ్యాడు. ఏడో ఓవర్‌లో ప్రమాదకరమైన పంత్‌ను ఔట్ చేసిన రషీద్.. తన రెండో ఓవర్‌లో కింగ్ కోహ్లీని కూడా ఔట్ చేశాడు. శివమ్ దూబే (10) రషీద్ ఖాన్ కు మూడో వికెట్ గా దొరికిపోయాడు.
సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ భారత్ బ్యాటింగ్ ప్రదర్శనలో హైలైట్ గా నిలిచింది. అతను రషీద్ ఖాన్ బౌలింగ్ లో వరుస స్వీప్ షాట్స్ ఆడాడు. ఇతర బౌలర్ల నుండి వచ్చిన లూస్ డెలివరీలను బౌండరీలుగా మలుస్తూ భారత స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. సూర్య కొన్ని సూపర్ షాట్స్ ఆడి ఔట్ అయిన తర్వాత హార్దిక్ పాండ్యా తన బ్యాట్ కు పనిచెప్పాడు. నూర్ అహ్మద్ వేసిన స్ట్రెయిట్ షాట్ ఒకటి ప్రెస్ బాక్స్ కిటికీని పగలగొట్టింది. ఇక చారిత్రాత్మక కెన్సింగ్టన్ ఓవల్‌లో భారత్ 8 వికెట్లు కోల్పోయి చేసిన 181 పరుగులు ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం.
కాగా, ఈ మ్యాచ్ లో భారత బౌలర్లు అదరగొట్టారు. అర్ష్ దీప్ సింగ్ 3 వికెట్లు, జస్ప్రీత్ బుమ్రా 3 వికెట్లు, కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీసుకున్నారు. అలాగే, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలు చెరో వికెట్ తీసుకున్నారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ 20 ఓవర్లలో ఆలౌట్ అయి 134 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత జట్టు ఆఫ్ఘనిస్తాన్ పై 47 పరుగుల తేడాతో విజయం సాధించింది.