హిట్ మ్యాన్ రోహిత్ శర్మ గురువారం తన 33వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. దీంతో అతనికి క్రికెటర్లు, అభిమానులు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇవాళ సోషల్ మీడియాలో అతని పేరు ట్రెండింగ్‌లో ఉంది.

అంతేకాకుండా రోహిత్ శర్మ గురించి తెలుసుకోవాలని అనేక మంది నెటిజన్లు గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. తన కెరీర్‌లో ఎన్నో రికార్డులు నెలకొల్పిన రోహిత్ శర్మ గత మూడేళ్లుగా అద్భుతమైన ఫామ్‌తో జట్టులో తిరుగులేని ఆటగాడిగా మారిపోయాడు.

Also Read:హిట్ మ్యాన్ బర్త్ డే.. స్పెషల్ డే అంటూ బీసీసీఐ, రికార్డ్స్ ఇవే.

ఈ మూడేళ్లలో 217 సిక్సర్లు బాది అంతర్జాతీయ క్రికెట్‌లో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. 2017లో 65, 2018లో 74, 2019లో 78 సిక్సర్లు కొట్టాడు. టెస్టుల్లో ఓపెనర్‌గా అవతారం ఎత్తి దక్షిణాఫ్రికాపై విరవిహారం చేశాడు.

విశాఖ వేదికగా జరిగిన టెస్టుల్లో ఏకంగా 13 సిక్సర్లు బాదాడు. తద్వారా ఓ టెస్టులో అత్యధిక సిక్సర్లు కొట్టిన తొలి భారత ఓపెనర్‌గా రోహిత్ నిలిచాడు. అంతేకాకుండా ఆ సిరీస్‌లో అత్యధిక (20) సిక్సర్లు సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ తన పేరిట మరో ఖాతాను నెలకొల్పాడు.

Also Read:తెలుగులో అదరగొట్టిన టీమిండియా క్రికెటర్లు, టాలీవుడ్ హీరోలపై చర్చ

కేవలం టెస్టుల్లోనే కాదు వన్డే, టీ20 మ్యాచ్‌ల్లో కూడా అత్యధిక సిక్సర్లు సాధించిన రికార్డులు అతని ఖాతాలో ఉన్నాయి. ఇప్పటి వరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 364 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ 14,029 పరుగులు సాధించాడు. ఇందులో 39 సెంచరీలు ఉన్నాయి.

మొత్తం మీద 423 సిక్సర్లతో హిట్ మ్యాన్ టాప్ 3లో ఉన్నాడు. అందుకే రోహిత్ శర్మను హిట్ మ్యాన్‌గా, సెహ్వాగ్ స్క్వేర్, సిక్సర్ల కింగ్ అని పిలుస్తారు. ఇక అత్యధిక సిక్సర్లు కొట్టిన వారి జాబితాలో విండీస్ విధ్వంసక ఆటగాడు (534) టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. షాహిద్ ఆఫ్రిది (476) ఆ తర్వాతి స్థానంలో నిలిచాడు.