హిట్ మ్యాన్, టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. లాక్‌డౌన్ టైమ్‌లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన 33వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా రోహిత్ శర్మకి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

కాగా.. బీసీసీఐ మాత్రం రోహిత్ శర్మ కి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ రోజు హిట్ మ్యాన్ కి స్పెషల్ డే అంటూ విషెస్ చెప్పడం విశేషం. కాగా.. ఈ ట్వీట్.. అభిమానులను ఆకట్టుకుంటోంది. 

ఇదిలా ఉండగా.. ఈ సీజన్‌ ఐపీఎల్‌ నిరవధిక వాయిదా పడటంతో ముంబై ఇండియన్స్‌ ఆటగాళ్లతో బర్త్‌ డేను సెలబ్రేట్‌ చేసుకునే అవకాశం రోహిత్‌కు దక్కలేదు. ఈసారి ఇంట్లోనే భార్య-కూతురితో కలిసి రోహిత్‌ పుట్టినరోజు వేడుకల్ని జరుపుకుంటున్నాడు.

2013 ఛాంపియన్స్ ట్రోఫీలో ఓపెనర్‌గా ప్రమోట్ అయ్యాక రోహిత్ వెనుదిరిగి చూసుకోలేదు. భారత క్రికెట్ జట్టులో కీలక ఆటగాడిగా, వైస్ కెప్టెన్‌గా ఎదిగాడు. కూల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తూ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు రికార్డు స్థాయిలో 4 పర్యాయాలు ట్రోఫీ అందుకున్నాడు.

రోహిత్ శర్మ రికార్డ్స్..

ఒక వన్డే ప్రపంచ కప్‌లో అత్యధిక సెంచరీలు (5) చేసిన బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ. 
వన్డే వరల్డ్ కప్ ఛేజింగ్‌లో అత్యధిక శతకాలు (3) చేసిన క్రికెటర్ హిట్ మ్యాన్.
ఇంగ్లాండ్ గడ్డ మీద హ్యాట్రిక్ శతకాలు బాదిన ఏకైక బ్యాట్స్‌మెన్. 2019 వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా రోహిత్ ఈ ఫీట్ సాధించాడు.
వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రోహిత్ (264)దే. వన్డేల్లో 3 డబుల్ సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్.
సిక్సర్‌తో అన్ని ఫార్మాట్లలో శతకం సాధించిన ఏకైక క్రికెటర్. వన్డేల్లో 3, టెస్టుల్లో 2, ఓ టీ20 శతకాన్ని సిక్స్‌ కొట్టి నమోదుచేశాడు.
టెస్టుల్లో ఓపెనర్‌గా వచ్చి రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ శతకం బాదిన తొలి బ్యాట్స్‌మెన్ రోహిత్.
2013 నుంచి 2019 మధ్య కాలంలో ప్రతి క్యాలెండర్ ఏడాదిలో వన్డే ఫార్మాట్‌లో 50కి పైగా బ్యాటింగ్ సగటు నమోదు చేశాడు. 500 లేక అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఏ క్రికెటర్‌ వరుసగా ఏడేళ్లు ఈ ఫీట్ సాధించలేదు.
2019లో 10 శతకాలు బాదాడు. అయితే ఓ క్యాలెండర్ ఏడాదిలో 7 జట్లపై శతకాలు బాదిన తొలి క్రికెటర్‌గా రికార్డు.
10 దేశాలలో 50 లేక అంతకన్నా ఎక్కువ ఇన్నింగ్స్ స్కోర్ చేసిన ఏకైక ఆటగాడు. భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్, ఐర్లాండ్, అమెరికా దేశాల గడ్డ మీద ఈ ఫీట్ సాధించాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా అన్ని ఫార్మాట్లలో శతకాలు బాదిన ఏకైక భారత ఓపెనర్ రోహిత్ శర్మ.