India Vs New Zealand: టీమిండియా ఆటగాళ్లను తిరిగి గాడిలో పెట్టేందుకు రాహుల్ ద్రావిడ్ మాస్టర్ ప్లాన్ వేశాడు. సదరు ఆటగాళ్ల నుంచి అతడు (ద్రావిడ్), భారత క్రికెట్ అభిమానులు ఏం కోరుకుంటున్నారో వాళ్లకు చెబుతూ మోటివేట్ చేస్తున్నాడని బోర్డు వర్గాల సమాచారం.

టీమిండియా కొత్త కోచ్ రాహుల్ ద్రావిడ్ ను అందరూ మిప్టర్ పర్ఫెక్ట్ అంటారు. భారత్ కు ప్రాతినిథ్యం వహించినప్పుడు ‘వాల్’ గా అందరి మన్ననలు పొందిన ద్రావిడ్.. కోచింగ్ బాధ్యతలు చేపట్టాక యువ ఆటగాళ్లను సానబెట్టే పనిలో పర్ఫెక్షనిస్టు అనిపించుకున్నాడు. ఆటగాళ్ల నుంచి వంద శాతం ఆటను రాబట్టడానికి ఏం చేయాలో రాహుల్ ద్రావిడ్ కు తెలుసు. టీమిండియా-ఏ టీమ్ ను గానీ, జట్టులోకి వస్తున్న యువ ఆటగాళ్లను గానీ చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. అయితే ఇటీవలే టీమిండియా హెడ్ కోచ్ గా నియమితుడైన రాహుల్ ద్రావిడ్.. టీ20 ప్రపంచకప్ లో పేలవ ప్రదర్శన తో గాడి తప్పిన భారత జట్టును తిరిగి దారిలో పెట్టేందుకు పూనుకున్నాడు. 

టీమిండియా ఆటగాళ్లను తిరిగి గాడిలో పెట్టేందుకు రాహుల్ ద్రావిడ్ మాస్టర్ ప్లాన్ వేశాడు. తాను కోచ్ గా బాధ్యతలు చేపట్టక కొద్ది రోజుల ముందు నుంచే తనకు అందుబాటులో ఉన్న ఆటగాళ్లకు వ్యక్తిగతంగా ఫోన్లు చేయడం.. వారి శారీరక, మానసిక పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడం వంటివి చేస్తున్నాడట. ఆటగాళ్ల సమస్యలు తెలుసుకుని వాటికి గల పరిష్కారాలు చూపుతూ.. ఇంకా ఏదైనా సాయం కావాలనుకుంటే బీసీసీఐ లోని క్రికెట్ సలహాదారుల ముందు వాటిని ఉంచుతున్నాడని సమాచారం. 

ఒక్కొక్క ఆటగాడికి ఫోన్ చేస్తున్న ద్రావిడ్.. వారి వ్యక్తిగత సమస్యలను కూడా సావదానంగా వింటున్నాడట. ఒకవేళ వాళ్లకు విశ్రాంతి కావాలనుకుంటే బోర్డుతో చెప్పి వాళ్లకు రెస్ట్ ఇప్పించడం.. జట్టులో తమ స్థానం పై భరోసా ఇవ్వడం వంటివి చేస్తున్నాడట. అంతేగాక.. సదరు ఆటగాళ్ల నుంచి అతడు (ద్రావిడ్), భారత క్రికెట్ అభిమానులు ఏం కోరుకుంటున్నారో వాళ్లకు చెబుతూ మోటివేట్ చేస్తున్నాడని టాక్.

ఇదీ చదవండి: కప్పు కావాలంట కప్పు! పాకిస్థాన్ ను ఓ ఆటాడుకుంటున్న ఇండియన్ ఫ్యాన్స్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ మాములుగా లేదుగా

ఇప్పటికే ద్రావిడ్ ఈ పని పూర్తి చేసినట్టు బోర్డు వర్గాల సమాచారం. ఆ మేరకే త్వరలో న్యూజిలాండ్ తో జరుగబోయే టీ20లు, టెస్టులకు జట్టును ఎంపిక చేసినట్టు సమాచారం. టీ20లకు రోహిత్ శర్మ సారథ్యం వహించనుండగా.. టెస్టులకు అతడు విశ్రాంతి కోరాడు. విరాట్ కోహ్లి టీ20 సిరీస్ తో పాటు తొలి టెస్టుకు కూడా దూరంగా ఉంటున్నాడు. విరాట్ (ఒక్క టెస్టు) తో పాటు షమీ, బుమ్రా, పంత్, రోహిత్ శర్మ సిరీస్ నుంచి పూర్తిగా విశ్రాంతి కోరుకున్నారు. దీంతో తొలి టెస్టుకు రహానే కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఇక టీ20 జట్టులో కూడా కొత్త కుర్రాళ్లే కనిపించబోతున్నారు. 

న్యూజిలాండ్ తో సిరీస్ ముగిశాక భారత్.. దక్షిణాఫ్రికా టూర్ కు వెళ్లనుంది. ఆ తర్వాత విండీస్.. ఇండియాకు రానున్నది. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ జరుగనున్నది. ఈ సిరీస్ లను దృష్టిలో ఉంచుకుని.. ఎవరిని ఆడించాలి..? ఎవరికి విశ్రాంతినివ్వాలి..? అనే విషయాలపై ద్రావిడ్ ప్రణాళికలను రూపొందిస్తున్నాడు. మరి ఇవి ఎంతమేరకు విజయమవంతమవుతాయో చూడాలి.