టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన ఖాతాలో మరో రికార్డు వేసుకున్నాడు. స్వదేశంలో అతి తక్కువ టెస్టుల్లో 250 వికెట్లు తీసిన భారత బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇండోర్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా ఆ జట్టు ఆటగాడు మోమినుల్ హక్ వికెట్‌ను తీయడం ద్వారా అశ్విన్ ఈ ఘనతను అందుకున్నాడు.

అంతకు ముందు భారత లెజండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే స్వదేశంలో తన 43వ టెస్టులో 250 వికెట్ సాధించాడు. అతని తర్వాత మాజీ ఆఫ్ స్పిన్నర్ హార్భజన్ సింగ్ 51వ టెస్ట్ ద్వారా 250 వికెట్ల ఘనతను అందుకున్నాడు.

మొత్తం మీద 250 అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన జాబితాలో శ్రీలంక మాజీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్‌తో కలిసి అశ్విన్ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. మురళీ సైతం 42వ టెస్ట్ ద్వారానే 250 వికెట్లు సాధించాడు.

Also Read:షమీ పేస్.. అశ్విన్ స్పిన్ మేజిక్: 150కే కుప్పకూలిన బంగ్లాదేశ్

మరోవైపు ఇప్పటి వరకు తన టెస్ట్ కెరీర్‌లో రవిచంద్రన్ అశ్విన్ 359 వికెట్లు తీసుకున్నాడు. ఇండోర్‌లో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 150కే ఆలౌటైంది. భారత బౌలర్లు వరుసపెట్టి వికెట్లు తీస్తుండటంతో బంగ్లాదేశ్ కోలుకోలేకపోయింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా.. ఆరంభంలోనే ఓపెనర్లు షాద్‌మన్ ఇస్లామ్, ఇమ్రుల్ కేస్‌లు ప్రారంభించారు. ఇషాంత్ వేసిన ఆరో ఓవర్ చివరి బంతికి షాద్‌మన్ ఇచ్చిన క్యాచ్‌ను వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అందుకున్నాడు.

ఆ వెంటనే ఉమేశ్ బౌలింగ్‌లో రహానేకు క్యాచ్ ఇచ్చి ఇమ్రుల్ ఔటయ్యాడు. దీంతో బంగ్లాదేశ్ 12 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత కెప్టెన్ మోమినుల్ హక్‌, మిథున్ జంట మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడింది.

Also Read:గంగూలీ ఎఫెక్ట్.. బద్ధకస్తుడి చేతిలో బాల్: రవిశాస్త్రిని ఆడుకుంటున్న నెటిజన్లు

అయితే ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను అశ్విన్ ఔట్ చేయడంతో మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం అశ్విన్, షమీలు చెలరేగడంతో బంగ్లాదేశ్ 41 పరుగుల వ్యవధిలో మరో నాలుగు వికెట్లు కోల్పోయింది.

టీ బ్రేక్ తర్వాత మ్యాచ్ ప్రారంభమైన తొలి బంతికి ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో లిటన్‌దాస్ ఔటయ్యాడు. సీనియర్ ఆటగాడు ముష్ఫీకర్ రహీమ్ 43 పరుగులతో ఒక్కడే భారత బౌలర్లను ఎదుర్కొన్నాడు. టీమిండియా బౌలర్లలో షమీ 3, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, అశ్విన్‌లు తలో రెండు వికెట్లు పడగొట్టారు