ICC World Cup 2023 : టీమిండియాకు షాక్... డెంగ్యూ బారినపడ్డ గిల్, ఆడటం అనుమానమే?
ప్రపంచ కప్ లో తొలి మ్యాచ్ ఆడకముందే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. అనారోగ్య కారణాలతో యువ క్రికెటర్ గిల్ తొలి మ్యాచ్ కు దూరం కానున్నట్లు తెలుస్తోంది.
చెన్నై : స్వదేశంలో జరుగుతున్న ప్రపంచ కప్ వేళ టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మంచి ఫామ్ లో వున్న యువ ఆటగాడు శుభ్ మన్ గిల్ భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న తొలి మ్యాచ్ కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. డెంగ్యూతో బాధపడుతున్న గిల్ ఈ మ్యాచ్ కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే కీలక మ్యాచ్ లో టీమిండియా మంచి ఓపెనర్ ను మిస్ అయినట్లే.
ఈ ప్రపంచకప్ లో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది టీమిండియా. ఇప్పటికే ఈ మెగా టోర్నీ ప్రారంభమవగా అక్టోబర్ 8న చెన్నైలో రోహిత్ సేన ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్ ఆడనుంది. లీగ్ దశలో బలమైన ఆసిస్ తో తలపడాల్సిన సమయంలో కీలక ఆటగాడు ఇలా జట్టుకు దూరమైతే ఆ ప్రభావం ఫలితంపై పడే ప్రమాదముంది. ఇలా ఓపెనర్ గిల్ టీమిండియా ఆడబోయే మొదటి మ్యాచ్ కు దూరమవుతున్నారన్న వార్త క్రికెట్ ఫ్యాన్స్ ను కలవరపెడుతోంది.
ప్రస్తుతం డెంగ్యూ బారినపడ్డ శుభ్ మన్ గిల్ బిసిసిఐ వైద్యుల పర్యవేక్షణలో వున్నట్లు సమాచారం. అతడి ఆరోగ్య పరిస్ధితిని వైద్యుల బృందం అనుక్షణం పరిశీలిస్తోందట. రెండుమూడు రోజుల్లో అతడు కోలుకునే అవకాశం లేకపోవడంతో ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ లో ఆడకపోవచ్చని తెలుస్తోంది. ఆ తర్వాత భారత్ తలపడే మ్యాచులకు అతడు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
Read More టీమిండియా ఫైనల్‌కి వెళ్తుంది, కానీ మళ్లీ మేమే గెలుస్తాం... ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ద్వారా శుభ్ మన్ గిల్ వెలుగులోకి వచ్చాడు. తన అద్భుత బ్యాటింగ్ తో అదరగొట్టిన ఈ యువ క్రికెటర్ టీమిండియా సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. ఇంకేముందు ఐపిఎల్ నుండి నేరుగా అంతర్జాతీయ జట్టులో వచ్చిపడ్డాడు. అక్కడా తన ఫామ్ ను కొనసాగిస్తూ టీమిండియాలో స్థిరమైన చోటు దక్కించుకున్నాడు. అతడి భీకర ఫామ్ ను చూసి కీలకమైన వన్డే ప్రపంచ కప్ ఆడే అవకాశం కల్పించారు సెలెక్టర్లు.
ప్రపంచ కప్ కు ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సీరిస్ లో గిల్ అదరగొట్టాడు. దీంతో ప్రపంచ కప్ లోనూ ఇదే ప్రదర్శన కొనసాగిస్తాడని క్రికెట్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి సమయంలో గిల్ ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ కు దూరం కానున్నాడన్న వార్త అభిమానులను కలవరపెడుతోంది.