Asianet News TeluguAsianet News Telugu

మనసుకు ఇబ్బంది అనిపించినప్పుడు.. విరామం మంచిదే: మ్యాక్స్‌వెల్‌కి కోహ్లీ మద్ధతు

మానసిక ఆరోగ్య సమస్యలతో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆస్ట్రేలియా విధ్వంసక ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అండగా నిలిచాడు.

Team India captain virat Kohli supports glenn maxwell retirement decision
Author
Mumbai, First Published Nov 13, 2019, 5:32 PM IST

మానసిక ఆరోగ్య సమస్యలతో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆస్ట్రేలియా విధ్వంసక ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అండగా నిలిచాడు. 2014లో ఇంగ్లాండ్ పర్యటనలో తానూ ఇలాంటి బాధలే అనుభవించానని కోహ్లీ గుర్తుచేసుకున్నాడు.

అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లకి అన్ని విషయాలు పంచుకోగలిగే సామర్ధ్యం ఉండాలని.. మ్యాక్స్‌వెల్ నిర్ణయం అసాధారణమని విరాట్ అభిప్రాయపడ్డాడు. తన కెరీర్ ఇక ముగిసిందన్న దశను తాను ఎదుర్కొన్నానని.. ఏం చేయాలో, ఎవరితో.. ఎలా మాట్లాడాలో కూడా తనకు తెలియలేదని కోహ్లీ గతాన్ని గుర్తు చేసుకున్నాడు.

మనందరం పని మీదే దృష్టి పెట్టాలని.. కానీ అవతలి వ్యక్తుల మదిలో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టమని విరాట్ అభిప్రాయపడ్డాడు. ఇదే సమయంలో మ్యాక్స్‌వెల్ తన నిర్ణయంతో ప్రపంచానికి ఒక ఉదాహరణగా నిలిచాడని కోహ్లీ కొనియాడాడు.

Also read:సెహ్వాగ్ రికార్డుని బ్రేక్ చేసిన రోహిత్ శర్మ ... సరిగ్గా ఇదేరోజు

మన మనస్సు సరిగ్గా లేనప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటామని.. ఒకానొక దశలో విసిగిపోతామని, అలాంటప్పుడు కొంత విరామం తీసుకోవడం శ్రేయస్కరమన్నాడు. 11 ఏళ్ల తన క్రికెట్ కెరీర్‌లో కేవలం 2014 ఇంగ్లాండ్ పర్యటనలో మాత్రమే కనీసం అర్థశతకం చేయలేక తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నానని విరాట్ వెల్లడించాడు.

మానసికంగా పూర్తి ఆరోగ్యంగా లేనని.. ఆట నుంచి తప్పుకుంటానని ఎప్పుడూ చెప్పలేదన్నాడు. ఎందుకంటే అటువంటి దానిని ఎలా అంగీకరించాలో తెలియదన్నాడు. ఆటను వదిలేయాలని తాను చెప్పనని.. అయితే ఇబ్బందిగా అనిపించినప్పుడు తాత్కాలికంగా విరామం తీసుకోవడం మంచిదేనని విరాట్ తేల్చిచెప్పాడు.

ఇటువంటి నిర్ణయాలు ఎవరు తీసుకున్నా వారిని గౌరవించాలని.. ప్రతికూలంగా భావించొద్దని మ్యాక్‌వెల్‌‌కు మద్ధతు పలికాడు. కాగా.. గతంలో కుంగుబాటు, మానసికమైన సమస్యలతో స్టీవ్ హార్మిసన్, మార్కస్ ట్రెస్కోథిక్, గ్రేమ్ ఫ్లవర్, సారా టేలర్ వంటి క్రికెటర్లు క్రికెట్‌కు వీడ్కోలు పలికారు.

Also Read:మూడు రోజుల్లో మరో హ్యాట్రిక్ కొట్టిన దీపక్ చాహర్

కాగా.. కొద్దిరోజుల క్రితం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవల తన 31వ పుట్టిన రోజు జరుపుకున్నారు. పుట్టిన రోజు నాడు తన భార్య, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మతో కలిసి ఆయన భూటాన్ వెళ్లారు.

అక్కడే ఆయన తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. కాగా...కోహ్లీకి అభిమానులు, సినీ సెలబ్రెటీలు, క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకంక్షలు తెలియజేశారు.

అలా తెలియజేసిన వారిలో మాజీ క్రికెటర్  యువరాజ్ సింగ్ కూడా ఉన్నారు. అందరిలా కాకుండా యువరాజ్ సింగ్ కాస్త ఎమోషనల్ గా ట్వీట్ చేశారు. యూవీ చేసిన ట్వీట్ కి కోహ్లీ ఎప్పుడు రిప్లై ఇస్తాడా అని అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు.  వారి ఎదరు చూపులకు ప్రతిఫలంగా కోహ్లీ యూవీ పోస్టుకి రిప్లై ఇచ్చారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios