బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బౌలర్లు టీమ్ హ్యాట్రిక్ సాధించారు. అదేంటి ఇలాంటి హ్యాట్రిక్‌లు కూడా ఉంటాయా అనే సందేహం మీకు రావొచ్చు. అసలు మ్యాటరేంటంటే.. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో టీ బ్రేక్ అనంతరం మొదలైన ఆటలో భాగంగా 54 ఓవర్ ఐదో బంతికి ముష్ఫికర్ రహీమ్ వికెట్‌ను షమీ తీశాడు.

ఆ తర్వాతి బంతికే మెహిదీద హాసన్‌ను షమీ పెవలియన్‌కు పంపాడు. ఈ క్రమంలోనే అంపైర్లు టీ బ్రేక్ ప్రకటించారు. టీ విరామం తర్వాత బౌలింగ్ చేసిన ఇషాంత్ శర్మ తొలి బంతికే లిటన్ దాస్‌‌ వికెట్ తీశాడు. దీంతో షమీ, ఇషాంత్‌లు సంయుక్తంగా టీమ్ హ్యాట్రిక్‌ను సాధించినట్లయ్యింది. అయితే షమీ వ్యక్తిగత హ్యాట్రిక్ సాధిస్తాడని ఆశగా ఎదురుచూసిన భారత అభిమానులకు నిరాశే ఎదురైంది.

Also Read:అశ్విన్ అరుదైన రికార్డ్: మురళీధరన్‌తో కలిసి ఫస్ట్ ప్లేస్‌లో

తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 150కే ఆలౌటైంది. భారత బౌలర్లు వరుసపెట్టి వికెట్లు తీస్తుండటంతో బంగ్లాదేశ్ కోలుకోలేకపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లా.. ఆరంభంలోనే ఓపెనర్లు షాద్‌మన్ ఇస్లామ్, ఇమ్రుల్ కేస్‌లు ప్రారంభించారు.

ఇషాంత్ వేసిన ఆరో ఓవర్ చివరి బంతికి షాద్‌మన్ ఇచ్చిన క్యాచ్‌ను వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా అందుకున్నాడు. ఆ వెంటనే ఉమేశ్ బౌలింగ్‌లో రహానేకు క్యాచ్ ఇచ్చి ఇమ్రుల్ ఔటయ్యాడు. దీంతో బంగ్లాదేశ్ 12 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత కెప్టెన్ మోమినుల్ హక్‌, మిథున్ జంట మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడింది.

Also Read:షమీ పేస్.. అశ్విన్ స్పిన్ మేజిక్: 150కే కుప్పకూలిన బంగ్లాదేశ్

అయితే ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను అశ్విన్ ఔట్ చేయడంతో మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం అశ్విన్, షమీలు చెలరేగడంతో బంగ్లాదేశ్ 41 పరుగుల వ్యవధిలో మరో నాలుగు వికెట్లు కోల్పోయింది. టీ బ్రేక్ తర్వాత మ్యాచ్ ప్రారంభమైన తొలి బంతికి ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో లిటన్‌దాస్ ఔటయ్యాడు.

సీనియర్ ఆటగాడు ముష్ఫీకర్ రహీమ్ 43 పరుగులతో ఒక్కడే భారత బౌలర్లను ఎదుర్కొన్నాడు. టీమిండియా బౌలర్లలో షమీ 3, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, అశ్విన్‌లు తలో రెండు వికెట్లు పడగొట్టారు. తొలి రోజు ఆటముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్ 37, పుజారా 43 పరుగులతో క్రీజులో ఉన్నారు.