ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసమే ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌ను వాయిదా వేసిందని పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు షోయబ్ అక్తర్, రషీద్ లతీఫ్ ఆరోపించారు. జియో క్రికెటర్ చర్చలో వారు మాట్లాడుతూ.. శక్తిమంతుడు, శక్తిమంతమైన క్రికెట్ బోర్డు విధానాలను రూపొందిస్తుందని.. వారి వల్ల ఇతరులు బాధపడాల్సి వుంటుందని అక్తర్ వ్యాఖ్యానించాడు.

టీ 20 ప్రపంచకప్, ఆసియా కప్ ఈ ఏడాది ఆడాల్సింది. అప్పుడు  భారత్- పాక్ మ్యాచ్ ఉండేదని.. కానీ వారలా చేయలేదని, ఎందుకంటే దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయని అక్తర్ ఆరోపించాడు. వీటి వివరాలు తాను ప్రస్తుతం చెప్పలేనని, టీ20 ప్రపంచకప్ జరగదని నేను, లతీఫ్ ఎప్పట్నించో చెబుతున్నామని షోయబ్ అన్నాడు.

ఐపీఎల్‌కు ఏం జరగకూడదని.. టీ20 ప్రపంచకప్‌కు ఏమైనా పర్లేదని అక్తర్ ధ్వజమెత్తాడు. క్రికెట్ నాణ్యత దెబ్బతింటున్నప్పటికీ.. ఆట నుంచి లక్షల డాలర్లు సంపాదించడమే వారికి ముఖ్యమని అక్తర్ ఆరోపించాడు.

Also Read:కుదించిన షెడ్యూల్, పెరిగిన డబుల్‌ హెడర్స్, ఐపీఎల్ లో మార్పులివే...

రషీద్ లతీఫ్ మాట్లాడుతూ... టీ20 ప్రపంచకప్ వాయిదా నిర్ణయంతో చాలా బోర్డులు ఆర్ధిక స్వప్రయోజనాలు చూసుకున్నాయని ఆరోపించాడు. బీసీసీఐతో పాటు అన్ని బోర్డులు ఈ విషయంలో ఐకమత్యంగానే ఉన్నాయని వ్యాఖ్యానించాడు.

ఫిబ్రవరి- మార్చిలో టీ20 పెడితే పీఎస్ఎల్‌కు నస్టం.. ఏప్రిల్- మే అయితే ఐపీఎల్‌కు, నవంబర్ - డిసెంబర్ అయితే బిగ్‌బాష్‌కు నష్టమన్నాడు. వీటన్నింటి దృష్ట్యా అన్ని బోర్డులు స్వప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చాయని లతీఫ్ తెలిపాడు.

ఆసియా కప్ వాయిదా పడుతుందని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ముందుగానే చెప్పాడంటే అతనికి పాక్ లేదా శ్రీలంక బోర్డులే చెప్పుండాలి కదా అని లతీఫ్ పేర్కొన్నాడు. కాగా కరోనా ముప్పుతో టీ20 ప్రపంచకప్‌ను ఐసీసీ వాయిదా వేసిన సంగతి తెలిసిందే.