ఇన్నాండ్లూ ఐసీసీ నిర్ణయం కోసం ఎదురుచూసిన బీసీసీఐ,టి20 ప్రపంచ కప్ వాయిదాతో.... ఐపీఎల్‌ నిర్వహణలో వేగం పెంచనుంది. కోవిడ్‌-19 మహమ్మారితో ఐపీఎల్‌ 2020 మార్చి 29 నుంచి ఏప్రిల్‌ 15కు అనంతరం నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. 

2020 టీ20 వరల్డ్‌కప్‌ను ఐసీసీ అధికారికంగా వాయిదా వేయటంతో ఐపీఎల్‌ నిర్వహణకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలికి ప్రోటోకాల్‌ స్వేచ్ఛ లభించింది. ఐపీఎల్‌ షెడ్యూల్‌, వేదిక, లాజిస్టికల్‌ సహా ఇతర కీలక అంశాలపై చర్చించేందుకు ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ రానున్న పది రోజుల్లో సమావేశం కానుంది. 

ఈ మేరకు ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ వెల్లడించారు. ' ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ మరో వారం పది రోజుల్లో సమావేశం కానుంది. తుది షెడ్యూల్‌ సహా ఇతర అన్ని అంశాలపై నిర్ణయాలు తీసుకుంటాం. ఇప్పటివరకైనా 60 మ్యాచులతో పూర్తి స్థాయి ఐపీఎల్‌ అనుకుంటున్నాం. వేదిక యుఏఈ కావచ్చు. 

వేదిక కేవలం నిర్వహణ సౌలభ్యం కోసమే. ఎక్కడ జరిగినా అభిమానులు లేకుండా ఖాళీ స్టేడియాల్లోనే ఆడనున్నారు' అని పటేల్‌ తెలిపాడు. ఇక ఐపీఎల్‌ 13కు సన్నద్ధం అయ్యేందుకు ఆటగాళ్లకు కనీసం మూడు వారాల శిక్షణ అవసరమని ఓ ప్రాంఛైజీ యాజమాని అన్నాడు. 

ఆటగాళ్లకు కనీసం 3-4 వారాల ట్రైనింగ్‌ అవసరమని, బీసీసీఐ షెడ్యూల్‌ ప్రకటంచిన వెంటనే తమ ప్రణాళికలకు తుది రూపు ఇస్తామని అన్నాడు. ఐపీఎల్‌ యుఏఈలో జరిగేటట్టు ఉందని, అందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రాంఛైజీ యజమాని అన్నాడు. 

60 మ్యాచులతో పూర్తి స్థాయి ఐపీఎల్‌కు సిద్ధమవుతున్నా.. రోజుల పరంగా ఐపీఎల్‌ నిడివి తగ్గేందుకు ఆస్కారం ఉందని, ఈ ఏడాది షెడ్యూల్‌ ప్రకారం కేవలం ఐదు రోజులే రెండు మ్యాచులను కేటాయించారు. కానీ రానున్న షెడ్యూల్‌లో డబుల్‌ హెడర్స్‌ (రెండు మ్యాచులు) వారానికి 4-5 సార్లు ఉండే అవకాశం లేకపోలేదని అంటున్నారు. 

ప్రభుత్వానికి కూడా బీసీసీఐ దీని గురించి విన్నవించింది. భారత కాలమానానికి అనుగుణంగానే అక్కడ మ్యాచ్లను నిర్వహించడంతోపాటుగా దీపావళి పండుగ వారాన్ని కూడా దృష్టిలో ఉంచుకొనే షెడ్యూల్ ని ఖరారు చేయనున్నారు. 

అవసరమైతే ఐపీఎల్ నిం ఒక వారం ముందుకు జరిపి(సెప్టెంబర్ 26కు బదులుగా సెప్టెంబర్ 16వ తేదీన) దీపావళి పండగకు అడ్డురాకుండా చూడాలనే యోచనలో ఉంది బీసీసీఐ.