Asianet News TeluguAsianet News Telugu

సెమీ ఫైనల్‌లో ఆఫ్ఘ‌నిస్తాన్ ఓట‌మికి కార‌ణాలు ఇవే

AFG vs RSA, T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో దక్షిణాఫ్రికా జట్టు చరిత్ర సృష్టించింది. అద‌ర‌గొడుతార‌నుకున్న ఆఫ్ఘ‌నిస్తాన్ జ‌ట్టు టోర్నీ నుంచి ఔట్ అయింది. అయితే, అద్భుత‌మైన ఆట‌తో ముందుకు సాగిన ఆఫ్ఘ‌న్ జ‌ట్టు ఎందుకు, ఎలా ఓడిపోయింది? ఓట‌మికి గ‌ల కార‌ణాలు ఏమిటి? 
 

T20 World Cup 2024: Here are the reasons for Afghanistan's defeat in the semi-finals, AFG vs RSA RMA
Author
First Published Jun 27, 2024, 9:55 AM IST

AFG vs RSA, T20 World Cup 2024: ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024లో ఆఫ్ఘనిస్తాన్ జ‌ట్టు అద్భుత‌మైన ఆట‌తో ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ముందుకు సాగింది. ఛాంపియ‌న్ జ‌ట్ల‌కు బిగ్ షాకిస్తూ సెమీ ఫైన‌ల్ కు చేరుకుంది. రషీద్ ఖాన్ సారథ్యంలోని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు ఈ మెగా టోర్నమెంట్ అంతటా అద్భుత ప్రదర్శన చేసింది. క‌ప్ అందుకోవ‌డానికి రెండు అడుగుల దూరంలో అంటే సెమీఫైనల్లో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమిపాలైంది. ప్రోటీస్ జ‌ట్టుతో పోలిస్తే ఆఫ్ఘ‌న్ చిన్న జ‌ట్టే అయిన‌ప్ప‌టికీ బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థిగా పోటీని ఇస్తుంద‌ని భావించారు కానీ, చాలా దారుణంగా ఓట‌మి పాలైంది. టీ20 ప్రపంచ కప్ 2024 సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికా చేతిలో  ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోవడానికి 5 ప్ర‌ధాన కార‌ణాలు గ‌మ‌నిస్తే.. 

టీ20 ప్రపంచ కప్ 2024 మొదటి సెమీ-ఫైనల్ మ్యాచ్ ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా క్రికెట్ స్టేడియంలో దక్షిణాఫ్రికా-ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగింది. ఇక్క‌డి వ‌ర‌కు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేస్తూ వ‌చ్చిన ఆఫ్ఘనిస్థాన్ జట్టు.. సౌతాఫ్రికాతో మాత్రం చెత్త ఆట‌తో చేతులెత్తేసింది. 9 వికెట్ల తేడాతో ఓట‌మిపాలైంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘన్ జట్టు 11.5 ఓవర్లలో కేవలం 56 పరుగులకే ఆలౌటైంది. దక్షిణాఫ్రికా చాలా ఓవర్లలో 57 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఇప్పుడు ఫైనల్‌కు చేరుకుంది.

ఆఫ్ఘ‌నిస్తాన్ ఓట‌మికి టాప్-5 ప్ర‌ధాన కార‌ణాలు


ఇలాంటి పిచ్ పై తొలుత బ్యాటింగ్.. ర‌షీద్ ఖాన్ త‌ప్పుడు నిర్ణ‌యం..

ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా క్రికెట్ స్టేడియంలోని పిచ్ పై ప్ర‌స్తుత ప‌రిస్థితులు గ‌మ‌నిస్తే తొలుత బ్యాటింగ్ చేయ‌డం అంత సులువు కాదు. ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు.. ఇది ఎంత పెద్ద తప్పుడు నిర్ణ‌యమ‌నేది మ్యాచ్ ప్రారంభ‌మైన కొద్ది సేప‌టికే తెలిసిపోయింది. ఈ పిచ్‌పై బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. దక్షిణాఫ్రికా కూడా 57 పరుగులు చేయడానికి దాదాపు 9 ఓవర్లు ఆడిందంటే ఎలా ఉంద‌నేది అర్థం అవుతుంది. 

ప్రాక్టీస్ లేక‌పోవ‌డం.. 

దక్షిణాఫ్రికాతో కీల‌క‌మైన సెమీఫైనల్ మ్యాచ్ కు ముందు ఆఫ్ఘనిస్తాన్‌కు ప్రాక్టీస్ చేసే అవకాశం కూడా రాలేదు. సోమవారం సెయింట్ విన్సెంట్‌లో ఆఫ్ఘనిస్తాన్ సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించింది. దీని త‌ర్వాత ఆ జ‌ట్టు ఎలాంటి ప్రాక్టీస్ లో పాల్గొన‌లేదు. మంగళవారం ఉదయం ట్రినిడాడ్‌కు ఆఫ్ఘ‌న్ విమానం 4 గంటలు ఆలస్యం అయింది. దీని కారణంగా, ర‌షీద్ ఖాన్ జ‌ట్టు ప్రాక్టీస్ చేసే అవకాశం లేదా కొత్త వేదికతో ట‌చ్ లోకి రావ‌డం చేసుకోలేక‌పోయింది.

మిడిల్ ఆర్డర్ మళ్లీ ఫ్లాప్.. 

టీ20 ప్రపంచకప్ 2024లో ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్లు జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించారు. అయితే మొద‌టి నుంచి మిడిలార్డర్ బ్యాట‌ర్ల నుంచి మంచి ప‌రుగుల ప్ర‌ద‌ర్శ‌న రాలేదు. సెమీ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై కూడా మ‌రోసారి మిడిలార్డ‌ర్ ఘోరంగా విఫ‌ల‌మైంది. అజ్మతుల్లా ఉమర్జాయ్ మినహా మరే బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరును అందుకోలేక సింగిల్ డిజిట్ కే ప‌రిమితం అయ్యారు.

సెమీఫైనల్ ఫై చేజారిన ఫోక‌స్.. 

సూప‌ర్-8 వ‌ర‌కు అద్భుత విజ‌యాల‌తో ముందుకు సాగిన ఆఫ్ఘ‌నిస్తాన్ జ‌ట్టుపై క్రికెట్ ల‌వ‌ర్స్ తో పాటు అన్ని దేశాల ప్లేయ‌ర్ల నుంచి ప్రశంస‌ల జ‌ల్లు కురిసింది. ఆ జ‌ట్టు కూడా సెమీఫైనల్‌కు చేరుకున్న సంతోషంతో పెద్ద‌ సంబరాలు చేసుకుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆఫ్ఘనిస్తాన్ వేడుక గురించి మాత్రమే చర్చలు జరిగాయి. దీంతో అఫ్గానిస్థాన్ జట్టు సెమీ ఫైన‌ల్ పై ఫోక‌స్ పెట్ట‌లేకపోయింద‌నే వాద‌న‌లు కూడా ఉన్నాయి.

కీల‌క మ్యాచ్ లో ఓపెనర్లు కూడా దెబ్బ‌కొట్టారు. 

టీ20 ప్ర‌పంచ క‌ప్ లో ఆఫ్ఘ‌న్ టీమ్ మిడిల్ ఆర్డ‌ర్ బ్యాట‌ర్లు ప‌రుగులు రాబ‌ట్ట‌డానికి ఇబ్బంది ప‌డుతూనే ఉన్నారు. అయితే, ఓపెన‌ర్లు రాణించ‌డంతో మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న‌తో అద‌ర‌గొట్టింది ఆ జ‌ట్టు. ఆఫ్ఘనిస్థాన్ ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ లు టోర్నీ మొద‌టి నుంచి మంచి ఇన్నింగ్స్ లు ఆడుతూ వ‌చ్చారు. కానీ, ఓపెనర్లిద్దరూ సెమీఫైనల్‌లో విఫ‌లం కావ‌డం కూడా ఆఫ్ఘ‌న్ ను దెబ్బ‌కొట్టింది. గుర్బాజ్ డకౌట్ కాగా, జద్రాన్ 2 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు (281 పరుగులు) చేసిన బ్యాట్స్‌మెన్ రహ్మానుల్లా గుర్బాజ్ కొన‌సాగుతుండ‌టం విశేషం.

AFG VS RSA : అద‌ర‌గొడుతార‌నుకుంటే టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ఇలా ఔట్ అయ్యారేంది మామా.. !

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios