Asianet News TeluguAsianet News Telugu

అతడిలో టాలెంట్ టన్నులకొద్దీ ఉంది.. మూడు ఫార్మాట్లలోనూ ఇరగదీస్తాడు.. యువ సంచలనంపై గావస్కర్ ప్రశంసలు

Ruturaj Gaikwad: త్వరలో న్యూజిలాండ్ తో జరిగే మూడు టీ20ల సిరీస్ కోసం బీసీసీఐ ఇప్పటికే జట్టును ప్రకటించింది. ఇటీవలే ముగిసిన  ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-14లో అదరగొట్టిన  పలువురు యువ క్రికెటర్లకు తుది జట్టులో చోటు దక్కింది.

Sunil Gavaskar lauds ruturaj gaikwad selection in T20I, says he can serve Team Inida in Three Formats
Author
Hyderabad, First Published Nov 13, 2021, 12:51 PM IST

టీ20 ప్రపంచకప్ లో భారీ అంచనాలతో అడుగుపెట్టి పేలవ  ప్రదర్శనతో ముగించిన టీమిండియా.. త్వరలోనే న్యూజిలాండ్ తో మూడు టీ20లు,  రెండు టెస్టులు ఆడనున్నది. నవంబర్ 17 నుంచి టీ20 సిరీస్ మొదలుకానున్నది. ఈ రెండు సిరీస్ ల కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఇప్పటికే జట్లను ప్రకటించింది. టీ20లకు రోహిత్ శర్మ సారథ్యం వహించనుండగా.. ఈసారి ఎంపిక చేసిన జట్టులో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-14లో అదరగొట్టిన  పలువురు యువ క్రికెటర్లకు చోటు దక్కింది. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడి ఈ ఏడాది ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్న రుతురాజ్ గైక్వాడ్ ఒకడు.  అయితే గైక్వాడ్ ఎంపికపై భారత   క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ ప్రశంసలు కురిపించాడు. అతడు మూడు ఫార్మాట్లలో ఇరగదీసే ఆటగాడని కొనియాడాడు. 

ఇదే విషయమై గావస్కర్ మాట్లాడుతూ.. ‘అతడిలో అద్భుతమైన టాలెంట్ దాగి ఉంది. గైక్వాడ్.. భవిష్యత్తులో టీమిండియాకు మూడు ఫార్మాట్ల (టెస్టు, వన్డే, టీ20) లలో  రాణిస్తాడు. అతడి షాట్ సెలక్షన్ గానీ ఆటతీరుగానీ చాలా బాగుంటుంది. అంతేగాక ఒత్తిడిని తట్టుకుని ఆడటంలో గైక్వాడ్ సిద్ధహస్తుడు. అంతర్జాతీయ క్రికెటర్ గా ఎదగడానికి గానీ, తనను  తాను నిరూపించుకోవడానికి గానీ  గైక్వాడ్ కు ఇది మంచి అవకాశమ’ని  ప్రశంసలు కురిపించాడు. 

మహారాష్ట్రలోని పూణెకు చెందిన గైక్వాడ్.. దేశవాళీ క్రికెట్ లో ఆ రాష్ట్రం తరఫునే ఆడుతున్నాడు.  ఐపీఎల్ లో మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ తరఫున పాల్గొంటున్నాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ లో గైక్వాడ్.. 635 పరుగులు చేసి  అత్యధిక పరుగులు  చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. గైక్వాడ్.. ఈ ఏడాదిలో శ్రీలంక కు వెళ్లిన భారత జట్టులో ఎంపికైనా అక్కడ నిరూపించుకోవడంలో విఫలమయ్యాడు. 

కానీ ఐపీఎల్ తో పాటుదేశవాళీ క్రికెట్ లో కూడా మెరిసిన రుతురాజ్ కు సెలెక్టర్లు మరో అవకాశమిచ్చారు. మరి న్యూజిలాండ్ సిరీస్ లో అతడు.. తనకు వచ్చిన రెండో అవకాశాన్ని ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి. 

ఇది కూడా చదవండి : అతడిని ఇంకెప్పుడు గుర్తిస్తారు..? బీసీసీఐపై ఫైర్ అవుతున్న ఫ్యాన్స్.. సంజూ శాంసన్ కు న్యాయం చేయాలంటూ డిమాండ్

రుతురాజ్ తో పాటు న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ కు ఎంపికైన అవేశ్ ఖాన్, వెంకటేష్ అయ్యర్, హర్షల్ పటేల్ పై కూడా గావస్కర్ ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్ లో అదరగొట్టిన ఈ  ఆటగాళ్లు జాతీయ జట్టుకు ఎంపికవడం భారత క్రికెట్ కు కూడా శుభసూచికమని తెలిపాడు.  

న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్  కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, ఆర్. అశ్విన్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్

Follow Us:
Download App:
  • android
  • ios