ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ వన్డేల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. మంగళవారం భారత్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ అనంతరం స్మిత్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉంటే స్మిత్ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్న విషయం కోహ్లికి ముందుగానే తెలుసా.? అనే చర్చ నడుస్తోంది..
ఆస్ట్రేలియా లెజెండరీ బ్యాటర్, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా సెమీఫైనల్‌లో భారత్ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓటమి చెందిన అనంతరం, మార్చి 4 మంగళవారం, దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ నిర్ణయం ప్రకటించారు. పట్ట్ కమిన్స్ గాయంతో ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమవడంతో స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియా కెప్టెన్‌గా నియమితులయ్యారు. 35 ఏళ్ల స్మిత్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్ లాంటి కీలక ఆటగాళ్లు లేని అనుభవం లేని జట్టును నడిపించారు. టోర్నమెంట్ గ్రూప్ దశలో, ఆస్ట్రేలియా గ్రూప్ A పాయింట్స్ టేబుల్‌లో ఒక విజయం, అలాగే రావల్పిండిలో, లాహోర్‌లో వర్షం కారణంగా రద్దయిన రెండు మ్యాచ్‌లతో రెండో స్థానంలో నిలిచింది. దీంతో సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.
సెమీ ఫైనల్‌లో స్టీవ్ స్మిత్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. టీమ్ ఇండియా 265 పరుగుల లక్ష్యాన్ని 48.1 ఓవర్లలో చేధించింది. ఆస్ట్రేలియా సెమీఫైనల్‌లో ఓడిన మరుసటి రోజే, స్టీవ్ స్మిత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. తన నిర్ణయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించిన స్మిత్, వన్డే క్రికెట్‌లో తన ప్రయాణం అద్భుతమైందని, 2015, 2019 వన్డే ప్రపంచకప్‌లు గెలిచిన జట్టులో భాగమవడం గర్వంగా ఉందని వెల్లడించాడు.
అయితే, స్టీవ్ స్మిత్ అధికారికంగా వన్డే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడానికి ముందే విరాట్ కోహ్లీ ఈ విషయాన్ని చెప్పేశారని అంతా అనుకుంటున్నారు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోన్న వీడియో చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించిన తర్వాత స్టీవ్ స్మిత్‌తో మాట్లాడుతూ.. 'ఇదే చివరి వన్డేనా.? అని ప్రశ్నించగా' స్మిత్ అవును అన్నట్లు సమాధానం ఇచ్చాడు. దీంతో కోహ్లీ భావోద్వేగంతో స్టీవ్‌ను హగ్ చేసుకున్నారు. స్మిత్ రిటైర్మెంట్ తర్వాత ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
వైరల్ అవుతోన్న వీడియో ఇదే..
స్టీవ్ స్మిత్ క్రికెట్ కెరీర్ విషయానికొస్తే.. 2010లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తరఫున వన్డే అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత జట్టులో తన స్థానం పదిలం చేసుకున్నాడు. 170 వన్డేల్లో 12 సెంచరీలు, 35 అర్ధశతకాలు సాధించి, 43.28 సగటుతో 5800 పరుగులు చేశాడు. అతని చివరి వన్డే మ్యాచ్ 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్, ఇందులో భారత్‌తో జరిగిన పోరులో 96 బంతుల్లో 73 పరుగుల మ్యాచుర్డ్ ఇన్నింగ్స్ ఆడి, జట్టును 264 పరుగుల వరకు చేర్చాడు. అయితే, ఆస్ట్రేలియా బౌలర్లు ఈ స్కోరును కాపాడలేకపోయారు.
వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్టీవ్ స్మిత్ ఇకపై టెస్ట్ క్రికెట్, టీ20లకు పూర్తిగా దృష్టి సారించనున్నాడు. 2026లో భారతదేశంలో జరగనున్న టీ20 ప్రపంచకప్ కోసం స్మిత్ జట్టులో ఉండే అవకాశం ఉంది. అలాగే, అతను టెస్ట్ క్రికెట్‌పై పూర్తిగా కేంద్రీకరించుకుంటూ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, యాషెస్ సిరీస్‌లపై దృష్టిపెట్టనున్నాడు. రిటైర్మెంట్ విషయాన్ని ప్రకటిస్తూ.. 'ఇది అద్భుతమైన ప్రయాణం, ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాను. ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు, విజయాలు ఉన్నాయి. రెండు ప్రపంచకప్‌లను గెలిచిన జ్ఞాపకాలు అత్యంత ప్రత్యేకమైనవి. మా జట్టుతో కలిసి పంచుకున్న అనుభవాలు మరువలేనివి' అని చెప్పుకొచ్చాడు.
