యాషెస్ సీరిస్ లో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ హవా కొనసాగుతోంది. వరుస సెంచరీలతో చెలరేగుతున్న అతడు వారి స్వదేశంలోనే  ఇంగ్లాండ్ జట్టుకు సవాల్ విసురుతున్నాడు. అయితే స్మిత్ వీరబాదుడుకు ఇప్పటికే టీమిండియా రన్  మెషిన్, కెప్టెన్ విరాట్ కోహ్లీ టాప్ ర్యాంక్ గల్లంతయ్యింది. తాజాగా కోహ్లీ పేరిట వున్న మరో అరుదైన రికార్డును కూడా స్మిత్ బద్దలుగొట్టాడు. 

వరుసగా మూడు టెస్ట్ మ్యాచుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో స్మిత్ మూడోస్థానానికి చేరుకున్నాడు. ఇప్పటివరకు ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ ల మధ్య యాషెస్ సీరిస్ లో భాగంగా నాలుగు మ్యాచ్ లు జరగ్గా స్మిత్ గాయం కారణంగా ఓ మ్యాచ్ ఆడలేదు. ఇలా కేవలం మూడు మ్యాచుల్లోనే అతడు 671 పరుగులు సాధించాడు. ఈ  క్రమంలోనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, పాకిస్థాన్ మాజీ దిగ్గజం మహ్మద్ యూసఫ్ లను వెనక్కినెట్టాడు. 

2006-07 సీజన్లో పాకిస్థాన్-వెస్టిండిస్ ల మధ్య మూడు టెస్టుల సీరిస్  లో యూసఫ్ 665 పరుగులు బాదాడు. అలాగే 2017-18 సీజన్లో భారత్-శ్రీలంక మధ్య జరిగిన మూడు టెస్టుల సీరిస్ లో కోహ్లీ 610 పరుగులు సాధించాడు. ఇలా వీరిద్దరు వరుసగా మూడు టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో మూడు, నాలుగు స్థానాల్లో వుండేవారు. కానీ స్మిత్ తాజా ఇన్నింగ్స్ తో వీరిద్దరి రికార్డులు ఒకేసారి బద్దలయ్యాయి. 671 పరుగులతో స్మిత్ మూడో స్థానంలోకి చేరుకోగా యూసఫ్ 4, కోహ్లీ 5 వ స్థానానికి పడిపోయారు. 

ఈ జాబితాలో ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ గ్రాహం కూచ్ 752 పరుగులతో అగ్రస్థానంలో వున్నాడు. అలాగే వెస్టిండిస్ దిగ్గజం బ్రియాన్ లారా 688 పరుగులతో సెంకండ్ ప్లేస్ లో నిలిచారు. వీరి సరసకు తాజాగా స్మిత్ చేరాడు.     

స్టీవ్ స్మిత్ యాషెస్ సీరిస్ ఆరంభం నుండి వరుస సెంచరీలతో అదరగొడుతున్నాడు. మొదటి టెస్ట్ రెండు ఇన్నింగ్సుల్లోనూ సెంచరీలతో(144,142 పరుగులు) రాణించి ఆసిస్ ను విజయతీరానికి చేర్చాడు. అయితే గాయం కారణంగా రెండో టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ కు దూరమైనా మొదటి ఇన్నింగ్స్ లో  92 పరుగులు బాదాడు. గాయం కారణంగా మూడో టెస్ట్ మొత్తానికి దూరమయ్యాడు. ఇక నాలుగో టెస్ట్ లో మళ్లీ  జట్టులోకి పునరాగమనం చేసిన అతడు మరింత కసితో ఆడాడు. ఓ డబుల్ సెంచరీ(211పరుగులు),మరో హాఫ్ సెంచరీ(82 పరుగులు)తో  చెలరేగి జట్టును గెలిపించాడు. దీంతో ఇంగ్లాండ్ పై ఆసిస్ 2-1 ఆధిక్యాన్ని పొందింది.  

సంబంధిత వార్తలు

''కోహ్లీ గొప్ప ఆటగాడే... స్మిత్ అంతకుమించి..''

''స్మిత్ ఓ ఛీటర్ మాత్రమే...ఎప్పటికీ గొప్ప ఆటగాడు కాలేడు''

స్టీవ్ స్మిత్ కంటే కోహ్లీయే అత్యుత్తమం: ఆసిస్ దిగ్గజం వార్న్

అందుకే స్టీవ్ స్మిత్ ప్రత్యేకం.. సచిన్ పొగడ్తలు