ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కెరీర్ లో అత్యుత్తమ ఫామ్ తో చెలరేగుతున్నాడు. యాషెస్ సిరీస్ లో మరో శతకాన్ని తన ఖాతాలో వేసుకున్న స్మిత్ పై పొగడ్తలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, ఇండియన్ క్రికెటర్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అంతటివాడు సైతం స్మిత్ బ్యాటింగ్ ప్రదర్శనకు ముగ్ధుడయ్యాడు. ఈ సందర్భంగా ట్విట్టర్ లో ఆసీస్ చిచ్చరపిడుగుపై వ్యాఖ్యలు చేశాడు. 

అంత తేలిగ్గా అంతుబట్టని సంక్లిష్టమైన టెక్నిక్, ఓ క్రమపద్ధతిలో ఆలోచించే విధానం స్టీవ్ స్మిత్ ను మిగతా క్రికెటర్ల కంటే విభిన్నంగా నిలుపుతున్నాయని అభిప్రాయపడ్డాడు. ఐసీసీ నిషేధం పూర్తయ్యాక అపూర్వమైన రీతిలో పునరాగమనం చేశాడని కితాబిచ్చాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న యాషెస్ లో స్మిత్ తొలి టెస్ట్ లో రెండు ఇన్నింగ్స్ లలో సెంచరీలు సాధించాడు. తాజాగా మాంచెస్టర్ టెస్టులోనూ అదే జోరు కొనసాగిస్తూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.