యాషెస్ సీరిస్ లో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ అద్భత ప్రదర్శన చేస్తున్నాడు. వరుస సెంచరీలతో అదరగొడుతూ ఆతిథ్య ఇంగ్లాండ్ పై ఒంటరిగా పోరాటం చేస్తున్నాడు. సహచరుల నుండి సహకారం అందకున్నా గెలుపు కోసం పోరాడుతూ అభిమానుల మనసులను దోచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అతన్ని ఆసిస్ మాజీలు, అభిమానులు కొందరు వరల్డ్ నంబర్ వన్ బ్యాట్స్ మెన్ అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. అయితే మాజీ ఆసిస్ దిగ్గజం షేన్ వార్న్ మాత్రం ఈ వాదనను వ్యతిరేకిస్తూ సంచలనం సృష్టించాడు. 

ఓవైపు స్మిత్ ను గొప్ప టెస్ట్ బ్యాట్స్ మన్ అంటూనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే మాత్రం గొప్పవాడు కాదని వార్న్ అన్నాడు. కోహ్లీ కేవలం టెస్టుల్లోనే కాదు వన్డే, టీ20 ఫార్మాట్లలో కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడు. అందుకు అతడు అంతర్జాతీయ క్రికెట్లో సాధించిన రికార్డులే నిదర్శనమని అన్నాడు. కాబట్టి కోహ్లీతో పోల్చే స్థాయి స్మిత్ ది కాదంటూ వార్న్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.  

కోహ్లీ ప్రస్తుతమున్న అందరు క్రికెటర్లలో లెజెండ్ అని వార్న్ ప్రశంసించాడు. అతడి పరుగుల ప్రవాహానికి ఇప్పటికే అనేక ప్రపంచ  రికార్డులు బద్దలయ్యాయని గుర్తుచేశాడు. సచిన్ టెండూల్కర్ వంద సెంచరీల రికార్డును కూడా కోహ్లీ బద్దలుగొడతాడని వార్న్ జోస్యం చెప్పాడు. 

అయితే కేవలం టెస్టుల్లో ప్రదర్శనను పరిశీలిస్తే మాత్రం స్మిత్ అత్యుత్తమ ఆటగాడని అన్నాడు. బాల్ ట్యాంపరింగ్ నిషేధం తర్వాత అతడి ఆటతీరులో చాలా మార్పులు వచ్చాయని... ప్రస్తుతం యాషెస్ సీరిస్ లో అతడి ప్రదర్శనను చూస్తే ఈ విషయం అర్థమవుతుందని వార్న్ తెలిపాడు. 

యాషెస్ సీరిస్ లో వరుస సెంచరీలతో చెలరేగుతున్నాడు. ఇలా ఇప్పటికే ఈ సీరిస్ లో మూడు సెంచరీలు బాదాడు. టెస్టుల్లో సెంచరీల పరంగా చూసుకుంటే  కోహ్లీని స్మిత్ అధిగమించాడు. అంతేకాకుండా టెస్ట్ ర్యాకింగ్స్ లోనూ కోహ్లీని వెనక్కినెట్టి స్మిత్ అగ్రస్థానాన్ని ఆక్రమించుకున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ కంటే స్మిత్ గొప్ప బ్యాట్స్ మెన్ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని వార్న్ ఖండిచాడు.