IND vs SA T20Is: ఇండియా-సౌతాఫ్రికా మధ్య ఈనెల 12న కటక్ లోని బారాబతి స్టేడియం వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నిర్వాహకులు టికెట్ల విక్రయాన్ని ప్రారంభించారు.
ఇండియాలో క్రికెట్ మతం వంటిది. ఐపీఎల్ పుణ్యమా అని దాని పరిధి నానాటికీ పెరుగుతున్నది. గడిచిన రెండున్నరేండ్లుగా కోవిడ్ వల్ల ప్రేక్షకులు లేక వెలవెలబోయిన స్టేడియాలు ఇప్పుడు కిక్కిరిసిపోతున్నాయి. తాజాగా ఇండియా-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న సిరీసే దానికి ప్రత్యక్ష ఉదాహరణ. ఈ ఇరు జట్ల మధ్య జరుగనున్న రెండో టీ20 కోసం ఒడిషా క్రికెట్ అసోసియేషన్ (ఒసీఎ) టికెట్ల విక్రయాన్ని ప్రారంభించగా.. ఇక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. టికెట్ల కోసం మహిళలు కొట్టుకున్నారు.
45వేల సీటింగ్ కెపాజిటీ ఉన్న బారాబతి స్టేడియంలో మంగళవారం నుంచే ఒసీఎ టికెట్ల విక్రయాన్ని ప్రారంభించింది. ఆన్లైన్, స్కూల్స్, ఇతరులకు పోగా 12వేల టికెట్లను విక్రయించేందుకు ఒసీఎ అన్ని ఏర్పాట్లు చేసింది.
అయితే మ్యాచ్ కు సమయం దగ్గరపడుతుండటంతో గురువారం స్టేడియం ముందు భారీ ఎత్తున జనం గుమిగూడారు. మహిళలు, పురుషుల కోసం ప్రత్యేకంగా లైన్లు కేటాయించారు. మహిళల కోసం రెండు క్యూలు, పురుషుల కోసం ఏడు క్యూలు ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఉదయం ఆరు గంటల నుంచే క్యూలలో జనసందోహం కనబడింది.
కాగా.. ఉదయం 9 అవుతుండగా మహిళల లైన్లలోకి కొంతమంది లైన్ లో నిల్చోకుండానే టికెట్ తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో వెనకాల ఉన్న మహిళలు.. వారితో వాగ్వాదానికి దిగారు. ‘మేం ఆరింటికి వచ్చి లైన్లలో నిల్చున్నాం కదా.. ఇప్పుడొచ్చి నువ్వు లోపలికి ఎలా వెళ్తావ్..?’అంటూ గొడవకు దిగారు. చిన్నగా మొదలైన ఈ గొడవ చినికి చినికి గాలివాన అయింది. జట్లు పట్టుకుని కొట్టుకోవడం.. లైన్లలోంచి తోసేయడం.. ఒకరిమీద ఒకరు పడి కొట్టుకున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి యత్నించినా అదీ కుదరలేదు. దీంతో పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో గురువారం రాత్రి జరిగిన తొలి టీ20 లో భారత్ పై దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. జూన్ 12 (ఆదివారం)న కటక్ లో రెండో టీ20 జరగాల్సి ఉంది.
