India vs Srilanka 2nd Test: పింక్ బాల్ టెస్టు కూడా మూడో రోజు ముగియకముందే ఫలితం తేలేలా కనిపిస్తుంది. లంకను క్లీన్ స్వీప్ చేసేందుకు భారత స్పిన్నర్లు.. వికెట్ల వేట మొదలెట్టారు. ఇప్పటికే లంక నాలుగు వికెట్లు కోల్పోయింది.
బెంగళూరు వేదికగా లంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ విజయానికి టీమిండియా స్పిన్నర్లు బాటలు వేస్తున్నారు. మూడో రోజు కొన్ని మెరుపు షాట్లతో జోరుమీద కనిపించిన లంక ఆనందాన్ని ఆవిరి చేస్తూ వరుసగా రెండు వికెట్లు పడగొట్టారు. హాఫ్ సెంచరీ చేసి టచ్ లోకి వచ్చిన కుశాల్ మెండిస్ (54) ను అశ్విన్ బోల్తా కొట్టిస్తే.. సీనియర్ బ్యాటర్ ఏంజెలొ మాథ్యూస్ ను జడ్డూ బౌల్డ్ చేశాడు.
రెండో రోజు ఓవర్ నైట్ స్కోర్ 28 పరుగుల వద్ద మూడో రోజు ఆట ఆరంభించిన లంక.. మూడో రోజు ఆటను ఫోర్ తో ఆరంభించింది. జడేజా వేసిన ఓవర్లో కరుణరత్నె వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. మరోవైపు కుశాల్ మెండిస్ కూడా అశ్విన్, జడ్డూలతో పాటు బుమ్రాను కూడా సమర్థంగా ఎదుర్కున్నాడు. కరుణరత్నె సంయమనంతో ఆడగా.. కుశాల్ మాత్రం జోరు పెంచాడు.
భారత బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కున్న కుశాల్ మెండిస్.. 57 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా జోరు పెంచుదామనుకున్న మెండిస్ ను అశ్విన్ బోల్తా కొట్టించాడు. అశ్విన్ వేసిన బంతిని ముందుకొచ్చి ఆడాడు మెండిస్. కానీ అది కాస్తా మిస్ అవ్వడంతో వికెట్ల వెనుక ఉన్న రిషభ్ పంత్.. స్టంపౌట్ చేశాడు.
మెండిస్ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన మాథ్యూస్.. ఎదుర్కున్న ఐదో బంతికే జడేజా బౌలింగ్ లో బౌల్డ్ అయి పెవిలియన్ కు చేరాడు. రెండు ఓవర్ల వ్యవధిలోనే భారత్.. రెండు కీలక వికెట్లు పడగొట్టి లంకపై ఒత్తిడి పెంచింది. ఇక మాథ్యూస్ నిష్క్రమణ అనంతరం క్రీజులోకి వచ్చిన ధనుంజయ డి సిల్వ (4) కూడా ఎక్కువ సేపు నిలువలేదు. అశ్విన్ వేసిన లంక ఇన్నింగ్స్ 27వ ఓవర్లో స్లిప్స్ లో ఉన్న హనుమ విహారి కి చిక్కాడు. ఇది అశ్విన్ కు టెస్టులలో 440వ వికెట్. దీంతో అతడు దక్షిణాఫ్రికా బౌలర్ డేల్ స్టెయిన్ ను అధిగమించాడు.
30 ఓవర్లు ముగిసేసరికి నాలుగు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తుండటంతో లంచ్ లోపే మ్యాచ్ ముగిసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ మ్యాచులో లంక గెలవాలంటే ఇంకా 333 పరుగులు చేయాలి.
స్కోరు వివరాలు : భారత్ తొలి ఇన్నింగ్స్ 252, రెండో ఇన్నింగ్స్ 303-9 డిక్లేర్డ్
శ్రీలంక : తొలి ఇన్నింగ్స్ 109 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ : 114-4
