రిటైర్‌మెంట్ నిర్ణయంపై శ్రీలంక టీ20 సారథి లసిత్ మలింగ యూటర్న్ తీసుకున్నారు. తనలో ఇంకా సత్తా వుందని మరో రెండేళ్లు ఆడగలనని చెబుతున్నాడు. ఆస్ట్రేలియాలో వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌ తర్వాత సైతం మలింగ అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

టీ20లో తనకు నాలుగు ఓవర్లు వస్తాయని.. తన నైపుణ్యంతో టీ20లలో బౌలర్‌గా కొనసాగొచ్చని అనుకుంటున్నానని లసిత్ వ్యాఖ్యానించాడు. ప్రపంచవ్యాప్తంగా తాను ఎన్నో టీ20 మ్యాచ్‌లు ఆడానని, మరో రెండేళ్లు ఆడగలనని అనిపిస్తోందని మలింగ్ వెల్లడించాడు.

Also Read:నిద్రపోతూ బెడ్ పక్కన పింక్ బాల్: రహానేపై ట్రోలింగ్

టీ20 ప్రపంచకప్‌కు కెప్టెన్‌గా వ్యవహరించమని గతంలో కోరారని.. అయితే శ్రీలంకలో ఎప్పుడేం జరుగుతుందో తెలియదని లసిత్ వ్యాఖ్యానించాడు. జట్టుకు ఎంపికవ్వాలంటే నిలకడగా రాణించడం అత్యంత కీలకమని... తాను సారథిగా ఉంటే నమ్మిన ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తానని మలింగ స్పష్టం చేశాడు.

రెండు, మూడేళ్లు కొనసాగిస్తేనే జట్టు మెరుగవుతుందని.. తాను వారికి సలహాలు ఇవ్వగలనన్నాడు. కాగా అంతర్జాతీయ టీ20లలో 100 వికెట్లు తీసిన తొలి, ఏకైక పేస్ బౌలర్‌గా మలింగ రికార్డుల్లోకి ఎక్కాడు. ప్రస్తుతం అతడి వయసు 36 ఏళ్లు.

Also Read:బంతిని షైన్ చేయొద్దన్నందుకు: గ్రౌండ్‌లోనే సహచరుడిని లాగి కొట్టిన క్రికెటర్

2011లో టెస్టులకు వీడ్కోలు చెప్పిన మలింగ.. ఈ ఏడాది జూలైలో వన్డేల నుంచి తప్పుకున్నాడు. కొలంబోలో ప్రేమదాస స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌ అతనికి చివరి వన్డే మ్యాచ్.

2004లో శ్రీలంక తరపున వన్డేల్లో అరంగేట్రం చేసిన మలింగ 226 వన్డేలు ఆడి 338 వికెట్లు పడగొట్టాడు. మాజీ దిగ్గజాలు మురళీధరన్ 534, చమిందా వాస్ 400 తర్వాత అత్యథిక వికెట్లు తీసిన బౌలర్‌గా మలింగ రికార్డుల్లోకి ఎక్కాడు.