భారత మాజీ క్రికెటర్ హార్భజన్ సింగ్.. మరో క్రికెటర్ శ్రీశాంత్‌ చెంప పగులగొట్టిన సంగఘటన అప్పట్లో క్రికెట్ ప్రపంచంలో సంచలన కలిగించింది. తాజాగా బంగ్లాదేశ్ క్రికెటర్‌ తోటి ఆటగాడిపై దాడికి పాల్పడి.. ఏడాది పాటు నిషేధానికి గురయ్యాడు.

వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్ నేషనల్ క్రికెట్ లీగ్‌లో భాగంగా ఢాకా డివిజన్-ఖుల్నా డివిజన్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో షహదాత్ హుస్సేన్ సహచర ఆటగాడు ఆరాఫత్ సన్నీపై దాడి చేశాడు. బంతిని ఒకవైపే షైన్ చేయొద్దంటూ ఆరాఫత్ చెప్పడంతో షహదాత్ ఆగ్రహంతో ఫీల్డ్‌లో అందరూ చూస్తుండగానే ఘర్షణకు దిగాడు.

ఈ షాక్ నుంచి వెంటనే తేరుకున్న తోటి ఆటగాళ్లు ఇద్దరినీ పక్కకు తీసుకెళ్లారు. ఈ ఘటన అనంతరం ఆరాఫత్ సన్నీ మాట్లాడుతూ.. బంతిని ఒక వైపే షైన్ చేయడం మంచి పద్దతి కాదని షహదాత్‌కు చెప్పానని.. దీంతో అతను తనను కొట్టాడని తెలిపాడు.

Also Read:హార్ట్ ఎటాక్.. క్రికెట్‌పై తగ్గని ప్రేమ: గ్రౌండ్‌లోనే కుప్పకూలిన క్రికెటర్

దీనిపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. సహచర ఆటగాడిపై చేయి చేసుకున్న షహదాత్‌పై ఏడాది పాటు నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. లెవల్ 4 నిబంధనను ఉల్లంఘించిన కారణంగానే హుస్సేన్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు బోర్డు స్పష్టం చేసింది.

దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో నేషనల్ క్రికెట్ లీగ్ నుంచి షహదాత్ తప్పుకున్నాడు. ఈ వివాదంపై షహదాత్ హుస్సేన్ మాట్లాడుతూ.. తాను నిషేధానికి గురైన కారణంగా లీగ్ ఆడటం లేదని స్పష్టం చేశాడు.

భవిష్యత్తులో కూడా ఏమవుతుందో చెప్పలేనని.. మ్యాచ్ మధ్యలో సహనాన్ని కోల్పోయిన మాట వాస్తవమేనని, కానీ సన్నీ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని అందుకే చేయి చేసుకున్నానని వెల్లడించాడు. తాను బంతిని షైన్ చేస్తుంటే అతను వారించాడు.

Also Read:తమ్ముడు కొట్టిన షాట్‌.. అన్న ముక్కు పంక్చర్

ఎందుకని అడిగితే గట్టి అరుస్తూ ఏదో అన్నాడని.. దానిని తాను జీర్ణించుకోలేక పోయానని అందుకే కొట్టాల్సి వచ్చిందని షహదాత్ తెలిపాడు. బంగ్లాదేశ్ తరపున 38 టెస్టులు ఆడిన షహదాత్ 72 వికెట్లు తీయగా.. 51 వన్డేలు ఆడి 47 వికెట్లు సాధించాడు.

అయితే షహదాత్‌కు నిషేధం కొత్త కాదు. 2015లో భార్యను వేధించిన కేసులో ఆరోపణలు రావడంతో అతనిపై బోర్డు సస్పెన్షన్ వేటు వేసింది. అనంతరం హుస్సేన్ విజ్ఞప్తి మేరకు నిషేధాన్ని సడలించి దేశవాళీ క్రికెట్‌ ఆడటానికి బంగ్లా బోర్డు అనుమతించింది.