PBKS vs MI: ఐపీఎల్‌లో 50 విజయాలు సాధించిన ఐదో కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకోనున్నాడు. ముంబై ఇండియన్స్‌పై క్వాలిఫయర్ 2లో గెలిచి ఈ రికార్డుతో పాటు పంజాబ్ కింగ్స్ ను ఫైనల్ కు చేర్చాలని అయ్యార్ టార్గెట్ పెట్టుకున్నాడు.
PBKS vs MI: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 2లో పంజాబ్ కింగ్స్ (PBKS) తో ముంబై ఇండియన్స్ (MI) తలపడనుంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు చారిత్రక విజయానికి మరో అవకాశం లభించనుంది. ఐపీఎల్ చరిత్రలో 50 విజయాలు సాధించిన ఐదో కెప్టెన్‌గా నిలవాలనే లక్ష్యంతో అయ్యర్ బరిలోకి దిగుతున్నారు.
ముందుగా క్వాలిఫయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైన పంజాబ్ టీమ్.. ఇప్పుడు ముంబయి ఇండియన్స్‌పై గెలిచి టైటిల్ పోరుకు వెళ్లాలని పట్టుదలగా ఉంది. లీగ్ దశలో 13 పూర్తి మ్యాచ్‌లలో 9 విజయాలతో అగ్రస్థానంలో నిలిచిన పంజాబ్ కింగ్స్.. ఇప్పుడు మళ్లీ గెలుపు బాట పట్టాలని చూస్తోంది.
ఐపీఎల్ లో మూడు జట్లకు కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్
శ్రేయాస్ అయ్యర్ ఇప్పటివరకు మూడు వేర్వేరు జట్లకు కెప్టెన్‌గా చేశాడు. అలాగే, ఆ జట్లను కనీసం ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లిన ఏకైక కెప్టెన్‌గా గుర్తింపు పొందాడు. ఢిల్లీ క్యాపిటల్స్ (DC), కోలకతా నైట్ రైడర్స్ (KKR), పంజాబ్ కింగ్స్ (PBKS)కు కలిపి మొత్తం 85 మ్యాచ్‌లలో కెప్టెన్ గా వ్యవహరించి 49 విజయాలు అందించాడు. రెండు మ్యాచ్‌లు టై కాగా, 34 ఓటములు ఉన్నాయి. రెండు మ్యాచ్‌లు ఫలితం లేకుండానే ముగిశాయి. అయ్యర్ కెప్టెన్ గా విజయ శాతం 57% కంటే ఎక్కువగా ఉంది.
2020లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లిన మొదటి కెప్టెన్‌గా అయ్యర్ గుర్తింపు పొందారు. ఆ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ చేతిలో ఓటమి చవిచూశారు. ఆ తర్వాత కేకేఆర్ కు నాయకత్వం వహించాడు. 2024లో ఆ జట్టుకు ఐపీఎల్ టైటిల్ అందించాడు. కేకేఆర్ తరపున 29 మ్యాచ్‌లలో 17 విజయాలు నమోదు చేశాడు. ఇక పంజాబ్ కింగ్స్ తరఫున 15 మ్యాచ్‌లలో 9 గెలవగా, 5 ఓటములు, ఒకటి ఫలితం లేకుండానే ముగిసింది.
లెజెండరీ ప్లేయర్ల జాబితాలోకి శ్రేయాస్ అయ్యర్
ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో కేవలం నలుగురు కెప్టెన్లు మాత్రమే 50 లేదా అంతకంటే ఎక్కువ విజయాలను నమోదు చేశారు. వారిలో లెజెండరీ కెప్టెన్ ఎంఎస్ ధోని (136 విజయాలు), రోహిత్ శర్మ (87 విజయాలు), విరాట్ కోహ్లీ (66 విజయాలు), గౌతమ్ గంభీర్ (71 విజయాలు) లు ఉన్నారు. ఇప్పుడు అయ్యర్ ఈ జాబితాలో చేరే అవకాశముంది.
2025 సీజన్‌లో అయ్యర్ ఇప్పటికే 516 పరుగులు చేశారు. అతని బ్యాటింగ్ సగటు 46.90 కాగా, స్ట్రైక్ రేట్ 170.86 ఉంది. ఈ సీజన్ లో అయ్యర్ బెస్ట్ స్కోర్ 97* పరుగులు. క్వాలిఫయర్ 2 మ్యాచ్ ఉత్కంఠను రేపుతోంది.
PBKS vs MI క్వాలిఫయర్ 2 జట్లు ఇవే
పంజాబ్ కింగ్స్ స్క్వాడ్: ప్రియాంష్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నేహల్ వధేరా, మార్కస్ స్టాయినిస్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్ప్రీత్ బ్రార్, కైల్ జేమిసన్, అర్షదీప్ సింగ్, ముషీర్ నౌషాద్ ఖాన్, విజయ్‌కుమార్ వైషాక్, ప్రవీణ్ దూబే, జావియర్ బార్ట్‌లెట్, సూర్యాంశ్ శెడ్జే, చహల్, విష్ణు వినోద్, యశ్ ఠాకూర్, ఆరోన్ హార్డీ, కుల్దీప్ సేన్, మిచెల్ ఓవెన్, హర్నూర్ సింగ్, పైల అవినాష్.
ముంబై ఇండియన్స్ స్క్వాడ్: రోహిత్ శర్మ, జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, రాజ్ బావా, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, రిచర్డ్ గ్లీసన్, అశ్వనీ కుమార్, రాబిన్ మిన్జ్, రఘు శర్మ, కృష్ణన్ శ్రిజిత్, రీస్ టాప్లీ, కర్ణ్ శర్మ, దీపక్ చహార్, అసలంక, ముజీబ్ ఉర్ రెహ్మాన్, అర్జున్ టెండూల్కర్, బీవాన్ జాకబ్స్, సత్యనారాయణ రాజు.