టీమిండియా మాజీ కెప్టెన్‌‌, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్‌ వార్తను ఆయన సహచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా మరో క్రికెటర్ కేఎల్ రాహుల్.. ధోనీ రిటైర్మెంట్‌పై స్పందించాడు.

ఆయన నిర్ణయం తనను షాక్‌కు గురిచేసిందని ఆయన అన్నాడు. ధోనీ ఆకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం కారణంగా అతనికి సరైన విధంగా వీడ్కోలు పలికే అవకాశం లేకుండా పోయిందని వాపోయాడు.

తనతో మరోసారి డ్రెస్సింగ్ రూం షేర్ చేసుకోవాలని ప్రతి ఒక్క క్రికెటర్ కోరుకుంటాడని రాహుల్ పేర్కొన్నాడు. ‘‘ ధోనీ నిర్ణయం వినగానే ఆ క్షణం తన గుండె పగిలినట్లు అనిపించిందని.. చాలా సేపటి వరకు తేరుకోలేకపోయానని అతను వ్యాఖ్యానించాడు.

Also Read:ధోనీ వీడ్కోలు.. ఇక తాను క్రికెట్ చూడనంటున్న పాక్ అభిమాని

తనతో పాటు ధోనీ కెప్టెన్సీలో ఆడిన ప్రతి ఒక్క క్రికెటర్ ఇలాంటి ఉద్వేగానికి లోనై ఉంటాడని కేఎల్ రాహుల్ చెప్పాడు. తనకు వీడ్కోలు చెబుతూ స్పెషల్‌గా ఫేర్‌వెల్ ఏర్పాటు చేసే వీల్లేకుండా పోయిందని అతను భావోద్వేగానికి గురయ్యాడు.

జట్టులోని ప్రతి ఆటగాడికి ధోనీ పూర్తి స్వేచ్ఛనిచ్చేవాడని, ఎలా ఆడాలో చెబుతూనే మా సహజత్వాన్ని కోల్పోకుండా... తమ తప్పుల్ని మేమే తెలుసుకునేలా గైడ్ చేసేవాడని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశాడు.

మమ్మల్ని మాలాగే ఉంచిన ఘనత ధోనీకే దక్కుతుందని.. ఎవరికైనా ఏదైనా సందేహం వస్తే మొదటగా పరిగెత్తుకు వెళ్లేది ధోని దగ్గరకేనని జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. తాము ధోనికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని... ధోనీతో పాటు రోహిత్, కోహ్లీ సారథ్యంలో ఆడటానికి తాను ఇష్టపడతానని కేఎల్ రాహుల్ స్పష్టం చేశాడు.