టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి మన దేశంతోపాటు.. ఇతర దేశాల్లోనూ ఫ్యాన్స్ విపరీతంగా ఉన్నారు. ఆ అభిమానం ఎలా ఉంటుంది అంటే.. ఆయన మ్యాచ్ ఏ దేశంలో ఆడితే.. అక్కడిదాకా వెళ్లిచూసేటంత.  అలాంటి అభిమానుల్లో పాకిస్తాన్ కి చెందిన మహ్మద్ బషీర్ బొజాయ్ కూడా ఒకరు. అతనిని చాచా చికాగో అని కూడా పిలుస్తారు.

పాకిస్తాన్ కి చెందిన ఈక్ష్న షికాగోలో స్థిరపడ్డారు. అయితే.. ఇటీవల ధోనీ తన రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ విషయం తెలిసిన వెంటనే బషీర్ కూడా ఒక ప్రకటన చేయడం గమనార్హం. ఇక నుంచి తాను క్రికెట్ చూడటం ఆపేస్తున్నానంటూ ఆయన పేర్కొనడం గమనార్హం. కాగా... కరోనా పరిస్థితులు కాస్త సర్దుమణిగిన తర్వాత భారత్ వచ్చి ధోనీని కలుసుకుంటానని అతను చెప్పడం విశేషం.

‘ మహీ వీడ్కోలు పలికాడు. నేనూ రిటైర్ అవుతా. అతను ఆడటం లేదు కాబట్టి మ్యాచులు చూసేందుకు నేను ఇక విదేశాలకు వెళ్లను. అతనిని నేను ప్రేమించాను. అతను కూడా నన్ను ప్రేమించాడు. ఎంత గొప్ప ఆటగాళ్లైనా ఏదో ఒక రోజు ముగించాల్సిందే. కానీ అతని వీడ్కోలు నాకెన్నో మధురస్మృతులను గుర్తుకు తెస్తుంది. మహీ వీడ్కోలు మ్యాచ్ ఆడివుంటే బాగుండేది’’ అని బషీర్ పేర్కొన్నారు.

కాగా... ధోనీ ప్రతి మ్యాచ్ కి బషీర్ హాజరౌతూనే ఉంటాడు. వాంఖడే వేధికగా 2011లో జరిగిన ప్రపంచకప్ లో భారత్, పాక్ మ్యాచ్ లో బషీర్ కి టికెట్ దొరకలేదు. అప్పుడు ధోనీనే బషీర్ కి టికెట్ పంపడం గమనార్హం.

కాగా.. కరోనా పరిస్థితులు సాధారణ స్థితికొచ్చాక రాంచీలోని ఇంటికి వెళ్లి ధోనీని కలుస్తానన్నాడు.రాంబాబును(మొహాలీకి చెందిన ధోనీ మరో వీరాభిమాని) కూడా తనతో రావాల్సిందిగా అడుగుతానని తెలిపాడు. ఐపీఎల్‌లో ధోనీ ఆటను చూసేందుకు వెళ్లాలని ఉందని.. కానీ కరోనా కారణంగా ప్రయాణాలపై నిబంధనలు, దానికి తోడు తన ఆరోగ్యం మెరుగ్గా లేకపోవడంతో వెళ్లలేకపోతున్నట్లు బషీర్ చెప్పాడు.