ఒక రెండు మూడు రోజులగా క్రికెట్ న్యూస్ అంతా షోయబ్ అక్తర్, డానిష్ కనేరియాల చుట్టూనే తిరుగుతుంది. షోయబ్ అక్తర్ చేసిన ఒక వ్యాఖ్య చిలికి చిలికి గాలివానలాగా మారి ఇప్పుడు అక్తర్ ఆ విషయాన్ని ఇంతటితో వదిలేయండి అని చెప్పేదాకా తీసుకొచ్చింది. 

తాను క్రికెట్‌ ఆడే రోజుల్లో సహచర క్రికెటర్‌ డానిష్‌ కనేరియాపై వివక్ష చూపెట్టారంటూ పాక్తిసాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ చేసిన వ్యాఖ్యలపై చెలరేగిన దుమారం ఇప్పుడప్పడు సెటిల్ అయ్యేలా కనబడడంలేదు. 

అక్తర్‌ వ్యాఖ్యలకు కొందరు మద్దతు పలకగా ఇంకొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. భారత క్రికెటర్లు కొందరు మద్దతుగా నిలవగా, పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్లు మాత్రం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 

జావెద్‌ మియాందాద్‌ మొదలుకొని ఇంజమాముల్‌ హక్‌, యూసఫ్‌, షాహిద్‌ అఫ్రిదిలు అక్తర్‌ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. డానిష్‌ కనేరియా హిందువు అనే కారణంగా ఎవరూ అవమానించలేదని పాక్ మాజీలు పేర్కొన్నారు.  

Also read: దాని కోసం ఏమైనా చేస్తావ్: కనేరియాపై నిప్పులు చెరిగిన మియాందాద్

ఇలా మాట్లాడుతూనే... అక్తర్ చెప్పిన ఆ మతపరమైన వివక్ష భారత్‌లో లేదా అంటూ కూడా వారు అక్తర్‌ను నిలదీశారు.చిలికి చిలికి గాలివానలాగా ఈ వివాదం మారడంతో వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు అక్తర్. 

తాను అన్న మాటలు ఏ సందర్భంలో మాట్లాడానో, ఏ ఉద్దేశంతో మాట్లాడానో తొలుత అందరూ తెలుసుకోవాలన్నాడు.  తనపై వస్తున్న విమర్శలకు బాధ్యత వహిస్తూ అందుకు సమాధానం కూడా ఇవ్వాల్సి ఉంది కాబట్టే ఈ వివరణ ఇస్తున్నట్టు తెలిపాడు. 

పాక్ క్రికెట్‌ జట్టులో ఫుల్లుగా మత వివక్ష ఉందని తాను అనలేదని,  కేవలం ఒకరో, ఇద్దరో కనేరియాను హిందూ అనే కారణంగా చిన్నచూపు చూసేవారని మాత్రమే తాను అన్నట్టు అక్తర్‌ తెలిపాడు. తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరిస్తూ, మొత్తం పాకిస్తాన్‌ క్రికెట్‌ అంటేనే మతవివక్ష అని తానేదో అన్నట్టు చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసాడు అక్తర్. 

Also read; మేం అజర్ ను కెప్టెన్ చేశాం, పాక్ రియల్ ఫేస్: కనేరియా ఇష్యుపై గంభీర్

రెండు రోజులుగా తాను చూస్తున్నానాని, తన చుట్టూ పెద్ద వివాదాన్ని సృష్టించారని వాపోయాడు అక్తర్. అందుకోసమే మరోసారి తన యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడుతున్నానని అన్నాడు. ఇకనైనా విమర్శలు ఆపుతారని ఆశిస్తున్నట్టు తెలిపాడు అక్తర్. 

పాకిస్థాన్ క్రికెట్ లో ఒక అలిఖిత ఒప్పందం ఉంది. అదే ఒకర్ని ఒకరు గౌరవించుకోవడం. ఒకరో ఇద్దరో క్రికెటర్లు మాత్రమే అలా హద్దులు మీరు ప్ర్తవర్తించారని తాను అన్నానని చెప్పాడు. ఇలాంటి ఒక్కరో ఇద్దరో బ్లాక్‌ షీప్స్‌ ఎక్కడైనా ఉండొచ్చు. అది ఇండియా అయినా పాకిస్తాన్ అయినా అని అన్నాడు. ఈ వివాదానికి ఇక్కడితోనైనా ముగింపు దొరుకుతుందని ఆశిస్తున్నానని అక్తర్‌ పేర్కొన్నాడు.