క్రికెట్ లవర్స్ కు బిగ్ షాకిచ్చిన శిఖర్ ధావన్..
Shikhar Dhawan Retirement: టీమిండియా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఒకప్పుడు భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌కు బలమైన స్తంభం, కానీ కాలంతో పాటు అతని కథ కూడా మారిపోయింది. భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో ఆడిన శిఖర్ ధావన్ 24 సెంచరీలు చేశాడు.
Shikhar Dhawan Retirement: భారత స్టార్ క్రికెటర్, ఓపెనర్ శిఖర్ ధావన్ ఒకప్పుడు భారత జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌కు బలమైన స్తంభం. టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాడు. స్టార్ క్రికెటర్ గా ఎదిగాడు. క్రికెట్ ప్రపంచంలో గబ్బర్ అంటూ ముద్దుగా పిలుచుకునే ధావన్ కథ కాలంతో పాటు మారిపోయింది. ఈ క్రమంలోనే క్రికెట్ లవర్స్ కు షాకిస్తూ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు శిఖర్ ధావన్. భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో క్రికెట్ ఆడిన శిఖర్ ధావన్ 34 టెస్టుల్లో 2315 పరుగులు, 167 వన్డేల్లో 6793 పరుగులు, 68 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో 1759 పరుగులు చేశాడు.
2022లో చివరి అంతర్జాతీయ మ్యాచ్
శిఖర్ ధావన్ గత రెండేళ్లుగా టీమ్ ఇండియాకు దూరంగా ఉన్నాడు. 2022లో బంగ్లాదేశ్ పర్యటనలో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. శిఖర్ ధావన్ తన చివరి వన్డే మ్యాచ్‌ని బంగ్లాదేశ్‌తో 10 డిసెంబర్ 2022న చిట్టగాంగ్‌లో ఆడాడు. ఇక 7 సెప్టెంబర్ 2018న ది ఓవల్‌లో ఇంగ్లాండ్‌తో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. శిఖర్ ధావన్ తన చివరి టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ని 29 జూలై 2021న శ్రీలంకతో ఆడాడు.
సూపర్ ఓపెనింగ్ జోడీగా
శిఖర్ ధావన్ భారత బ్యాటింగ్ ఆర్డర్ లో బలమైన ప్లేయర్ గా కొనసాగాడు. సూపర్ ఒపెనర్ గా అనేక మంచి ఇన్నింగ్స్ లు ఆడాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో తొలిసారిగా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రోహిత్ శర్మ-శిఖర్ ధావన్‌లను ఓపెనర్‌గా రంగంలోకి దించాడు. అప్పటి నుంచి వీరిద్దరూ భారత బ్యాటింగ్‌కు పునాది అయ్యారు. వీరిద్దరూ కలిసి టాప్ ఆర్డర్‌లో చాలా పరుగులు చేశారు. రోహిత్‌తో పాటు, ధావన్ ప్రపంచంలోని ప్రతి మైదానంలో పరుగులు చేశాడు. అతని బ్యాటింగ్ చూసి పెద్ద పెద్ద బౌలర్లు కూడా భయపడిన క్షణాలు ఉన్నాయి. అయితే, యంగ్ ప్లేయర్ల ఎంట్రీతో సెలక్టర్లు చాలా కాలంగా శిఖర్ ధావన్‌ను విస్మరిస్తున్నారు. ఈ క్రమంలోనే అతను అంతర్జాతీయ క్రికెట్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. టెస్టు, వన్డే, టీ20లతో సంబంధం లేకుండా తుఫాను బ్యాటింగ్‌కు పెట్టింది పేరు శిఖర్ ధావన్.
టీమిండియా మ్యాచ్ విన్నర్ శిఖర్ ధావన్
భారత జట్టుకు శిఖర్ ధావన్ అనేక అద్భుత విజయాలు అందించాడు. టీమిండియా బిగ్ మ్యాచ్ విన్నర్‌గా గుర్తింపు పొందాడు. అయితే ఫామ్ ను కంటిన్యూ చేయడం అతని కెరీర్‌లో అతిపెద్ద అడ్డంకిగా మారింది. వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు పెద్ద టోర్నీలు గెలిచిన అనుభవం ఉంది. 2013లో భారత్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకుంది, ఇందులో శిఖర్ ధావన్ పాత్ర ఎప్పటికీ గుర్తుండి పోతుంది. 2013లో శిఖర్ ధావన్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధికంగా 363 పరుగులు చేశాడు. అతని పూర్తి కెరీర్ ను గమనిస్తే క్రికెట్ లో ఆడినన్ని రోజులు టాప్ క్లాస్ ప్లేయర్ గా నిలిచాడు.