Asianet News TeluguAsianet News Telugu

‘నీ కూతుర్ని బార్డర్ కు పంపి అప్పుడు ఆయనను ఎలాగైనా పిలుచుకో..’: టీమిండియా మాజీ క్రికెటర్ పై మండిపడ్డ గంభీర్

Gautam Gambhir: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు సిద్దూ.. ‘పెద్దన్న’గా సంభోదించడం వివాదానికి దారితీసింది. దీనిపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మండిపడుతున్నది. తాజాగా ఇదే వివాదంపై భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ కూడా స్పందించాడు. 

Send your children To border, Gautam Gambhir Fire On Navjot Singh Sidhu
Author
Hyderabad, First Published Nov 21, 2021, 5:46 PM IST

భారత్-పాకిస్థాన్ (India vs pakistan) దేశాల మధ్య సరిహద్దు వివాదాలు నిత్య కృత్యమైన వేళ టీమిండియా (Team India) మాజీ క్రికెటర్, పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (PPCC) అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ (Navjot Singh Sidhu) చేసిన  వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. శనివారం పాకిస్థాన్  (Pakistan) లోని కర్తార్పూర్ (Kartarpur Corridor) ను సందర్శించిన ఆయన.. అనంతరం ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ను ‘పెద్దన్న’గా సంభోదించడం వివాదానికి దారితీసింది. దీనిపై భారతీయ జనతా పార్టీ తీవ్రంగా మండిపడుతున్నది. తాజాగా ఇదే వివాదంపై భారత మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ కూడా సిద్దూపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. ‘నీ కూతురు, కుమారుడిని సరిహద్దులకు పంపు..’ అంటూ తీవ్రంగా స్పందించాడు. 

ట్విట్టర్ వేదికగా స్పందించిన Gautam Gambhir.. ‘నీ కుమారుడు లేదా కూతుర్ని సరిహద్దులకు పంపిన తర్వాతే ఉగ్రవాదానికి సహకరిస్తున్న  ఆ దేశాధినేతను పెద్దన్నగా పిలుచుకో.. ఇది చాలా తీవ్రమైన విషయం..’ అంటూ మండిపడ్డాడు. 

 

శనివారం సిద్ధూ.. పాక్ లోని కర్తార్పూర్ సాహిబ్ ను దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడాడు. ‘భారత్, పాక్ ప్రధానులు మోదీ, ఇమ్రాన్ ఖాన్ ల చొరవ వల్లే కర్తార్పూర్ నడవా తిరిగి తెరుచుకుంది. పంజాబ్ ఆర్థికాభివృద్ధి సాధించాలంటే వాణిజ్య కార్యకలాపాల కోసం రెండు దేశాల సరిహద్దులను తిరిగి తెరవాలి. పంజాబ్ నుంచి పాక్ కు 21 కిలోమీటర్ల దూరమే ఉన్నప్పుడు ముంద్రా పోర్టు మీదుగా 2,100 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సిన అవసరం ఏమిటి..?’ అని అన్నాడు. ఈ క్రమంలోనే పాక్ ప్రధానిపై కూడా తన సోదరభావాన్ని గుర్తు చేసుకుంటూ.. ‘ఇమ్రాన్ ఖాన్ నాకు పెద్దన్న వంటి వారు. అతడు నాకు చాలా ప్రేమను ఇచ్చాడు. దీనిని నేను గొప్ప గౌరవంగా భావిస్తున్నాను..’ అని వ్యాఖ్యానించాడు. 

 

ఇదే విషయాన్ని  ప్రస్తావిస్తూ బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పత్రా తో పాటు ఆ పార్టీకి చెందిన ఇతర నాయకులు కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.  ఇక పాకిస్థాన్ అండదండలతో చెలరేగుతున్న ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ 70 ఏండ్లుగా పోరాడుతుంటే.. దానికి సహకరిస్తున్న దేశాధినేతను సిద్ధూ పెద్దన్నగా పేర్కోవడం సిగ్గుచేటని గంభీర్ మండిపడ్డాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios