పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా సర్ఫరాజ్ అహ్మద్‌ను తప్పించడాన్ని మాజీ కెప్టెన్, మాజీ చీఫ్ సెలక్టర్ ఇంజమాముల్ హక్ తీవ్రంగా తప్పుబట్టాడు. జట్టుకు ఎన్నో విజయాలు అందించిన సర్ఫరాజ్‌ను మరి కొంతకాలం కెప్టెన్‌గా కొనసాగిస్తే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డాడు.

ఒక కెప్టెన్‌గా ఎంతో అనుభవం సాధించి తప్పుల్ని సరిదిద్దుకుంటున్న క్రమంలో సర్ఫరాజ్‌ను తప్పించడం సరైన నిర్ణయం కాదన్న ఆయన... సారథ్య బాధ్యతల నుంచి తప్పించడం నిజంగా దురదృష్టకరమన్నాడు.

Also Read:సర్ఫరాజ్ అహ్మద్ పై వేటు: శ్రీలంకపై సిరీస్ వైట్ వాష్ తోనే ముప్పు

సర్ఫరాజ్ కెప్టెన్సీలో పాక్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడంతో పాటు టీ20లలో నంబర్ వన్ స్థానానికి చేరింది. దీంతో పాటు మంచి విజయాలను కూడా జట్టుకు అందించడానికి ఇంజమామ్ గుర్తుచేశాడు. నాయకుడిగా మరికొంతకాలం పాటు వుండటానికి సర్ఫరాజ్‌కు అన్ని అర్హతలు ఉన్నాయి.

ఇంకాస్త ఓపిక పడితే బాగుండేదని ఇంజమామ్ తెలిపాడు. 2016 నుంచి 2019 వరల్డ్ కప్ వరకు పాకిస్తాన్ జాతీయ జట్టుకు చీఫ్ సెలక్టర్‌గా వున్న ఇంజమామ్... 2019 వన్డే వరల్డ్ కప్‌లో పాక్ క్రికెటర్లు అభద్రతా భావానికి లోను కావడంతోనే నాకౌట్‌కు చేరకుండా నిష్క్రమించాల్సి వచ్చిందని అభిప్రాయపడ్డాడు.

కెప్టెన్‌గా సర్ఫరాజ్‌ను నిందించాల్సిన అవసరం లేదన్న ఆయన.. విపరీతమైన ఒత్తిడి కారణంగా సరిగా ఆడలేమని మనసులో పెట్టుకుని అందుకు మూల్యం చెల్లించుకున్నారని ఇంజమామ్ విమర్శించారు.

Also Read:ఆర్టికల్ 370 రద్దు... పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ సంచలన వ్యాఖ్యలు

గతంలో టెస్ట్, వన్డే, టీ20 ఇలా మూడు ఫార్మాట్లకు సర్ఫరాజ్ కెప్టెన్‌గా ఉండగా.. వరల్డ్‌కప్‌లో జట్టు దారుణ ప్రదర్శన తర్వాత అతనిని సారథ్య బాధ్యతల నుంచి తొలగించారు. తొలుత వన్డే, టీ20 ఫార్మాట్ల నుంచి కెప్టెన్‌గా తొలగించి.. అనంతరం టెస్ట్ కెప్టెన్సీని కూడా లాక్కున్నారు.

బాబర్ అజామ్‌కు వన్డే, టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించగా.. అజహర్ అలీకి టెస్ట్ కెప్టెన్సీ ఇచ్చారు. ఇకపోతే, ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన జట్టుకు సర్ఫరాజ్‌కు అవకాశం కల్పించడం కాస్తంత ఊరటనిచ్చే అంశం.