కరాచీ: ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ లో పాకిస్తాన్ వైట్ వాష్ కావడంతో సర్ఫరాజ్ అహ్మద్ కెప్టెన్సీకి ముప్పు తెచ్చింది. సర్ఫరాజ్ ను టెస్టు, టీ20 జట్ల కెప్టెన్సీని తొలగిస్తూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబి) నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల క్రితం పాకిస్తాన్ ప్రధాన కోచ్ గా, చీఫ్ సెలెక్టర్ గా నియమితులైన మిస్బావుల్ హక్ పాకిస్తాన్ క్రికెట్ జట్టులో దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్్టారు. 

దిద్దుబాటు చర్యల్లో భాగంగానే తొలుత సర్ఫరాజ్ ను రెండు ఫార్మాట్ల కెప్టెన్ గా తప్పించారు. క్రికెటర్లను ఏకతాటిపై నడిపించి, వారిని సరైన దారిలో పెట్టడంలో సర్ఫరాజ్ విఫలమయ్యారని మిస్బా భావిస్తున్నారు. దాంతో సర్ఫరాజ్ ను కెప్టెన్సీ నుంచి తప్పించారు. 

వన్డేలకు మాత్రమే సర్ఫరాజ్ ను కెప్టెన్ గా పరిమితం చేశారు. అజర్ అలీకి టెస్టు కెప్టెన్సీ బాధ్యతలను, బాబర్ ఆజమ్ కు టీ20 కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు. సర్ఫరాజ్ వన్డేల కెప్టెన్ గా కొనసాగుతూ కూడా చేసేదేమీ లేదు. వచ్చే ఏడాది జులై వరకు కూడా పాకిస్తాన్ కు వన్డే సిరీస్ లు లేవు. ఈలోగా వన్డే జట్టు నాయకత్వం నుంచి కూడా ఆయన తప్పించవచ్చు. 

2016లో సర్ఫరాజ్ టీ20 కెప్టెన్ గా ఎంపికయ్యాడు. 2017లో వన్డేల సారథ్యాన్ని కూడా అతనికి అప్పగించారు. ఆ తర్వాత టెస్టు జట్టు కెప్టెన్ గా కూడా నియమించారు అయితే, పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన శ్రీలంక జూనియర్ జట్టు చేతిలో సర్ఫరాజ్ జట్టు ఓటమి పాలైంది. దాంతోనే అతని కెప్టెన్సీకి ఎసరు వచ్చింది.

అత్యున్నత స్థాయిలో జట్టుకు నాయకత్వం వహించే గౌరవం దక్కిందని, కొత్త కెప్టెన్లు తమ బాధ్యతల్లో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నానని సర్ఫరాజ్ అహ్మద్ అన్నాడు. అజర్ అలీని, బాబర్ ఆజమ్ ను పీసీబీ చైర్మన్ ఎహసాన్ మణి అభినందించారు.