జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం తీవ్రంగా  వ్యతిరేకిస్తోంది. భారత దేశ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చడమే కాకుండా దీన్ని అంతర్జాతీయ సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. ఇలా తమ దేశ వక్రబుద్దికి తాజాగా పాక్ క్రికెటర్లు కూడా వత్తాసు పలుకుతున్నారు. 

సోమవారం బక్రీద్ పండగను పాకిస్థాన్ క్రికెట్ టీం కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా జరుపుకున్నాడు. కరాచీలోని ఓ మసీదులో జరిగిన ఈద్గా ప్రార్థనల్లో అతడు పాల్గొన్నాడు. ఈ ప్రార్థన ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్టికల్ 370 రద్దుపై స్పందించాడు. 

భారత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జమ్మూ కశ్మీర్ ప్రజల హక్కులను హరించివేసిందని సర్ఫరాజ్ ఆరోపించాడు. అక్కడి ప్రజలకు రక్షణగా నిలిచిన ఆర్టికల్ 370, 35ఏ ను రద్దు చేయడాన్ని అతడు తప్పుబట్టాడు. ఇలా ప్రస్తుతం కష్టాల్లో వున్న కశ్మీరీ సోదరులకు యావత్ పాకిస్థాన్ అండగా వుంటుందని...వారి బాధలు, కష్టాలను సమానంగా పంచుకుంటుందని అన్నాడు. కశ్మీరీ ప్రజలను ఈ కష్టాల  నుండి కాపాడాలని అల్లాను ప్రార్థించినట్లు సర్ఫరాజ్ పేర్కొన్నాడు. 

''ఐక్యరాజ్య సమితి సమక్షంలో కశ్మీరీలకు ప్రత్యేక హక్కులు కల్పించబడ్డాయి. మనందరి లాగే స్వేచ్చగా జీవించే అవకాశాన్ని ఈ హక్కుల ద్వారా వారు పొందారు. అయితే ప్రస్తుతం కశ్మీలను మానవ హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరిస్తుంటే యూఎన్ఎ ఎందుకు స్పందించడం లేదు? ఎందుకు మొద్దునిద్రను ప్రదర్శిస్తోంది?. అమెరికా అధ్యక్షుడు స్థానంలో వున్న డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించి కశ్మీరీ  హక్కులను కాపాడాలి.''  అంటూ గతంలో మాజీ క్రికెటర్ అఫ్రిది 370 ఆర్టికల్ రద్దును ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు. తాజాగా సర్ఫరాజ్ కూడా తమ మాజీ ప్లేయర్ మాదిరిగానే కశ్మీర్ విషయంలో స్పందించాడు.