ఆస్ట్రేలియా యంగ్ బ్యాట్స్‌మెన్ లబూషేన్‌పై టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆస్ట్రేలియాలో బుష్‌‌ఫైర్‌తో సర్వం కోల్పోయిన వారి కోసం క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ఛారిటీ గేమ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

అందుకోసం ఆసీస్‌కు చేరుకున్న సచిన్ టెండూల్కర్‌ మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు మీ స్టైల్‌కు దగ్గరగా ఉన్న ఆటగాడిని ఎవరైనా ఉన్నారా అని విలేకరులు అడగ్గా.. అందుకు లబూషేన్ అని సచిన్ సమాధానం ఇచ్చాడు.

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా జట్ల మధ్య లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టును తన మావయ్యతో కలిసి ఆసక్తిగా చూస్తున్నానని.. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో స్టీవ్ స్మిత్ గాయం కారణంగా బ్యాటింగ్‌కు రాలేదన్నాడు.

Also Read:అండర్ 19 ప్రపంచ కప్: ఫైనల్లో ఇండియా ప్రత్యర్థి బంగ్లాదేశ్

అతని స్థానంలో బరిలోకి దిగిన లబూషేన్ ఇన్నింగ్స్‌ను కాస్త ఆసక్తిగానే తిలకించానని సచిన్ గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో 15 నిమిషాలు ఆడిన తర్వాత లబూషేన్‌లో ఒక స్పెషల్ ప్లేయర్ కనిపిస్తున్నాడనే విషయాన్ని తన మావయ్యతో అప్పుడే చెప్పానని టెండూల్కర్ గుర్తుచేసుకున్నాడు.

ముఖ్యంగా అతని ఫుట్‌వర్క్ అమోఘం, అదే అతనిలో స్పెషల్, ఫుట్‌వర్క్ అనేది శరీరానికి సంబంధించినది కాదని, మనసుకు సంబంధించినదన్నాడు. పాజిటివ్‌గా ఆలోచించకపోతే.. నీ కాలిని ఎటు కదల్చాలో తెలియదని సచిన్ అభిప్రాయపడ్డాడు. ఫుట్‌వర్క్ విషయంలో తనను లబూషేన్ గుర్తుచేశాడని టెండూల్కర్ పేర్కొన్నాడు.

కాగా.. యాషెస్ సిరీస్‌లో కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన అతను అప్పటి నుంచి తనదైన ఆటతో దూసుకుపోతున్నాడు. 2019లో హ్యాట్రిక్ సెంచరీలు సాధించిన లబూషేన్.. కొత్త సంవత్సరం ఆరంభంలోనే డుబుల్ సెంచరీ బాదాడు. గత నెలలో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ద్విశతకంతో మెరిసి.. గతేడాది టెస్టుల్లో వెయ్యి పరుగులు సాధించిన ఏకైక క్రికెటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు.

Also Read:నాకో డౌట్.. నువ్వు నాలుక ఎందుకు బయటకు తీస్తావ్‌: టేలర్‌‌ను ప్రశ్నించిన భజ్జీ

మరోవైపు కార్చిచ్చు బాధితుల కోసం శనివారం నిర్వహించాల్సిన మ్యాచ్‌ను ఆదివారం మెల్‌బోర్న్‌లోని జంక్షన్ ఓవల్ స్టేడియానికి మార్చారు. ఈ మ్యాచ్‌లో రికీ పాంటింగ్ లెవెన్‌కు సచిన్ కోచ్‌గా వ్యవహరిస్తుండగా.. గిల్ క్రిస్ట్ లెవెన్‌కు వెస్టిండీస్ మాజీ పేసర్ కోట్నీ వాల్ష్ కోచ్. 

రికీ పాంటింగ్‌ లెవెన్‌: రికీ పాంటింగ్‌ (కెప్టెన్‌), మాథ్యూ హెడెన్‌, జస్టిన్‌ లాంగర్‌, ఎలీస్‌ విలానీ, బ్రియాన్‌ లారా, పోబీ లిచ్‌ఫీల్డ్‌, బ్రాడ్‌ హాడిన్‌ (వికెట్‌ కీపర్‌), బ్రెట్‌ లీ, వసీం అక్రమ్‌, డాన్‌ క్రిస్టియన్‌, లూక్‌ హాడ్జ్‌.
 
గిల్‌క్రిస్ట్‌ లెవెన్‌: ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), షేన్‌ వాట్సన్‌, బ్రాడ్‌ హాడ్జ్‌, యువరాజ్‌ సింగ్‌, అలెక్స్‌ బ్లాక్‌వెల్‌, ఆండ్రూ సైమండ్స్‌, నిక్‌ రివోడ్ట్‌, పీటర్‌ సిడిల్‌, ఫవాద్‌ అహ్మద్‌, టిమ్‌ పెయిన్‌. (ఒక ఆటగాడిని ఇంకా ప్రకటించాల్సి ఉంది).