హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సారథి కోహ్లీ, కోచ్ రవిశాస్త్రిపై ప్రశంసల వర్షం కురిపించాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో తన అద్భుత ప్రదర్శనకు జట్టు యాజమాన్యం, కోహ్లీ, రవిశాస్త్రి మద్థతే కారణమని పేర్కొన్నాడు .

సఫారీలతో సిరిస్‌లో కొత్త బంతిని సమర్థంగా ఎదుర్కొన్నానని.. టెస్టుల్లో ఓపెనర్‌గా తనకు శుభారంభం దక్కిందని రోహిత్ తెలిపాడు. ఓపెనర్‌గా అరంగేట్రం చేసిన టెస్టు సిరీస్‌లోనే రెండు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌లు, మ్యాన్ ఆఫ్ ద సిరీస్  గెలుచుకోవడం విశేషం.

Also Read: ధోనీ ఇక్కడే ఉన్నాడు పలకరించండి: విలేకరితో కోహ్లీ సరదా సంభాషణ

మూడో టెస్టులో భారత్ విజయం సాధించిన అనంతరం మాట్లాడిన హిట్ మ్యాన్.. ఎలాగైనా రాణించాలనే ధృడ సంకల్పంతోనే బరిలోకి దిగినట్లు వెల్లడించాడు. 2013లో వన్డేల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగినప్పుడే ఓపెనింగ్ అనేది కీలక బాధ్యతని గుర్తించినట్టు రోహిత్ పేర్కొన్నాడు.

ఈ స్థానంలో క్రమశిక్షణతో, జాగ్రత్తతో ఆడి ఇన్నింగ్స్‌ను ఆరంభించాల్సి ఉంటుంది. ఒకసారి గాడిలో పడిన తర్వాత మన సహజ సిద్ధమైన గేమ్‌ను ఆడొచ్చని.. ఇదే సూత్రాన్ని అనుసరించి వన్డేల్లో ఓపెనర్‌గా సక్సెస్ అయ్యానని రోహిత్ తెలిపాడు.

టెస్ట్ ఫార్మాట్ అనేది భిన్నమైన బాల్ గేమ్.. ఎప్పటికప్పుడు మానసిక పరిణితితో ఆడాల్సి ఉంటుందన్నాడు. ఈ సిరీస్ ప్రారంభమైన నాటి నుంచి తనలో తానే మాట్లాడుకున్నానని .. భారీ స్కోర్లు సాధించాలని అనుకున్నానని రోహిత్ గుర్తు చేసుకున్నాడు.

భారత్‌ను పటిష్ట స్థితిలో నిలపాలంటే తన నుంచి మంచి ఇన్నింగ్స్‌ రావాలనే లక్ష్యంతో ముందుకు సాగానని .. శ్రమకు తగ్గ ఫలితం వచ్చిందని వెల్లడించాడు. కాగా.. దక్షిణాఫ్రికా సిరీస్‌లో రోహిత్ శర్మ నాలుగు ఇన్నింగ్సుల్లో 132.25 సగటుతో 529 పరుగులు చేశాడు.

ఇందులో ఒక డబుల్ సెంచరీ, రెండు సెంచరీలున్నాయి. కాగా రాంచి టెస్ట్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. సఫారీలపై ఘనవిజయం సాధించి  భారత్ గడ్డపై టెస్టుల్లో తమకి తిరుగులేదని  మరోసారి నిరూపించుకుంది. 202 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై భారత్  గెలుపొందింది. దీంతో  3-0తో సిరీస్‌ని క్లీన్ స్విప్ చేసింది.

Also Read: రోహిత్ నయా రికార్డు.. ప్రత్యర్థిని చిత్తు చేసి...ఐదో క్రికెటర్ గా

విశాఖలో జరిగిన తొలి టెస్టులో 203 పరుగుల తేడాతో గెలిచిన భారత్ ఆ తర్వాత పుణె టెస్టులోను , 137 పరుగుల తేడాతో విజయం సాధించింది. తాజాగా రాంచీ టెస్ట్‌లోను  తన సత్తా చాటి మరో సారి సొంత గడ్డపై తిరుగులేదని నిరూపించుకుంది.

ఓవర్‌నైట్‌ స్కోరు 132/8తో  నాలుగోరోజు ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సఫారీలురెండు ఓవర్లలోనే ఆలౌటయ్యారు. భారత బౌలర్ నదీమ్‌ రెండు వికెట్లు పడగొట్టడంతో  రెండో ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే దక్షిణాఫ్రికా కుప్పకూలిపోయింది .