సినీ తారలపై ట్రోలింగ్ జరగడం సర్వసాధారణం. అయితే కొన్ని సందర్భాల్లో క్రీడాకారులు కూడా ఈ ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే గౌరవ ప్రదమైన స్థానంలో ఉన్న వారు ఇలాంటి కామెంట్స్ చేస్తే సమాజమే అంగీకరించదు. తాజాగా ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు శారు కాంగ్రెస్ ప్రతినిధి షామా. టీమిండియా కెప్టెన్ పై ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద రచ్చకు దారి తీశాయి.. 

భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ ప్రతినిధి షామా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్‌పై గెలిచిన తర్వాత రోహిత్ ఫిట్‌నెస్‌ను ఆమె ప్రశ్నించారు. ఇప్పుడీ అంశం రాజకీయంగాకూడా సంచలనంగా మారింది. 

ఆదివారం షామా ఎక్స్ వేదికగా ఓ వివాదాస్పద ట్వీట్ చేశారు. రోహిత్ 'లావుగా ఉన్నాడని', 'ఆయన సాధారణ కెప్టెన్' అని ఎక్స్ వేదికగా విమర్శించారు. సచిన్, గంగూలీ వంటి దిగ్గజాలతో పోలిస్తే రోహిత్ ఏమంత గొప్ప కాదంటూ రాసుకొచ్చారు. 

“రోహిత్ శర్మ లావుగా ఉన్నాడు! అతను బరువు తగ్గాలి! అంతేకాదు, అతను అత్యంత సాధారణ కెప్టెన్!” అని షామా ట్వీట్ చేశారు. గంగూలీ, టెండూల్కర్, ద్రావిడ్, ధోని, కోహ్లీ, కపిల్ దేవ్ వంటి వారితో పోలిస్తే రోహిత్ గొప్ప కాదన్నారు. అతను అదృష్టం కొద్దీ కెప్టెన్ అయ్యాడని విమర్శించారు. 

Scroll to load tweet…
Scroll to load tweet…

ఆమె వ్యాఖ్యలపై క్రికెట్ అభిమానులు, రాజకీయ నాయకులు మండిపడుతున్నారు. ఒక రాజకీయ నాయకురాలై ఇలా మాట్లాడడం ఏంటంటూ విమర్శించారు. అయితే విమర్శలకు ప్రతిస్పందించిన షామా.. కీలక మ్యాచ్‌లలో రోహిత్ నిర్ణయాలను ప్రశ్నించారు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో రోహిత్ ఓపెనర్‌గా రావడంతో కేఎల్ రాహుల్ మూడో స్థానానికి వెళ్లాల్సి వచ్చిందని, శుభ్‌మన్ గిల్ తుది జట్టులో లేడని ఆమె అన్నారు.

మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో కేఎల్ రాహుల్‌ను నంబర్ 3కి పంపి, తాను నంబర్ 1కి వెళ్లడం స్వార్థపూరితం కాదా అని ఆమె ప్రశ్నించారు. దాని వల్ల శుభ్‌మన్ గిల్ జట్టులో లేకుండా పోయాడని ఆమె అన్నారు. అహ్మదాబాద్‌లో జరిగిన ప్రపంచ కప్ కూడా ఓడిపోయామని గుర్తు చేశారు.

Scroll to load tweet…

బీజేపీ కౌంటర్

షామా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ వెంటనే స్పందించింది. రాహుల్ గాంధీ కెప్టెన్సీలో 90 ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్లు రోహిత్ కెప్టెన్సీని విమర్శిస్తున్నారని బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు. ఢిల్లీలో ఆరుసార్లు డకౌట్ అయినా, 90 ఎన్నికల్లో ఓడిపోయినా గొప్పే కానీ, టీ20 ప్రపంచ కప్ గెలవడం గొప్ప కాదా అని ఆయన అన్నారు. రోహిత్‌కు కెప్టెన్‌గా మంచి రికార్డు ఉందని ఆయన గుర్తు చేశారు.

Scroll to load tweet…

స్పందించిన బీసీసీఐ: 

శమా మహమ్మద్‌ చేసిన పోస్టుపై భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డ్‌ స్పందించింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా ఈ కామెంట్స్‌ను తీవ్రంగా తప్పుబట్టారు. వ్యక్తిగత ప్రచారం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవుపలికారు. జట్టు ఓ కీలకమైన ఐసీసీ టోర్నీ మధ్యలో ఉందని, ఇలాంటి సమయంలో ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి నుంచి ఇటువంటి దిగజారుడు వ్యాఖ్యలు రావడం దురదృష్టకరమని కాస్త ఘాటుగానే స్పందించారు. అవి వ్యక్తిగతంగా ఆటగాడిపైనా లేదా.. జట్టుపై ప్రతికూల ప్రభావం చూపించి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే అవకాశాలు ఉంటాయని, ఇప్పటికైనా ఇలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని దేవజిత్‌ సైకియా అభిప్రాయపడ్డారు. 

ఇదిలా ఉంటే తాజాగా జరుగుతోన్న ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ న్యూజిలాండ్‌పై 44 పరుగుల తేడాతో గెలిచి గ్రూప్ Aలో అగ్రస్థానంలో నిలిచింది. శ్రేయాస్ అయ్యర్ 79 పరుగులు, వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు తీయడంతో భారత్ సునాయాస విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక మంగళవారం టీమిండియా ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్ లో తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిచి ఫైనల్ కి దూసుకెళ్లాలని చూస్తోంది.