WI vs IND T20I: ప్రస్తుతం వెస్టిండీస్ తో వన్డే సిరీస్ ఆడుతున్న టీమిండియా అది ముగిసిన వెంటనే అదే జట్టుతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది.
అపజయమే అన్నదే లేకుండా సిరీస్‌ల మీద సిరీస్‌లు నెగ్గుతున్న టీమిండియా.. మరో ఆసక్తికర పోరాటానికి సిద్ధమైంది. వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టు ఇప్పటికే వన్డే సిరీస్ ను కైవసం చేసుకుని బుధవారం జరుగబోయే మూడో వన్డేలో కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తున్నది. మరోవైపు ఇదే వారంలో శుక్రవారం నుంచి ప్రారంభం కాబోయే టీ20 పోరు కోసం భారత జట్టు రెగ్యులర్ సారథి రోహిత్ శర్మతో పాటు పొట్టి సిరీస్ కు ఎంపికైన ఆటగాళ్లంతా పోర్ట్ ఆఫ్ స్పెయిన్ కు చేరారు.
ఇంగ్లాండ్ త్ వన్డే సిరీస్ ముగిసిన తర్వాత అక్కడే విశ్రాంతి తీసుకున్న టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు రిషభ్ పంత్ కూడా ఇంగ్లాండ్ నుంచే కరేబియన్ దీవులకు చేరాడు. వీరిద్దరేగాక దినేశ్ కార్తీక్ కూడా ట్రినిడాడ్ కు వచ్చిన బ్యాచ్ లో ఉన్నాడు.
కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ లు కూడా విండీస్ తో టీ20లకు ఎంపిక కావడంతో వాళ్లు కూడా ట్రినిడాడ్ కు చేరారు. భారత ఆటగాళ్లు బస చేస్తున్న హోటల్ కు చేరుకుంటున్న వీరి వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.
అయితే ప్రస్తుతం విండీస్ పర్యటనలో ఉన్న ఆటగాళ్లతో పాటు మిగిలిన ఆటగాళ్లు కూడా ట్రినిడాడ్ కు చేరుకున్నా ఇండియా స్టార్ బ్యాటర్ కెఎల్ రాహుల్ మాత్రం వీరితో ఎక్కడా కనిపించలేదు. అతడు విండీస్ తో టీ20లకు ఎంపికైనా ఇటీవలే కరోనా బారిన పడటంతో వీడియోలో ఎక్కడా కనిపించలేదు. టీ20 సిరీస్ కు మూడు రోజులే గడువుండటంతో అతడు విండీస్ టూర్ కు వస్తాడా..? రాడా..? అనేది అనుమానంగా ఉంది.
విండీస్ తో టీమిండియా టీ20 సిరీస్ షెడ్యూల్:
- జులై 29 తొలి టీ20 : బ్రియాన్ లారా స్టేడియం, ట్రినిడాడ్
- ఆగస్టు 01 రెండో టీ20 : వార్నర్ పార్క్, సెయింట్ కిట్స్
- ఆగస్టు 02 మూడో టీ20 : వార్నర్ పార్క్, సెయింట్ కిట్స్
- ఆగస్టు 06 నాలుగో టీ20 : ఫ్లోరిడా (అమెరికా)
- ఆగస్టు 07 ఐదో టీ20 : ఫ్లోరిడా
