Virat Kohli: గతేడాది టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత  ఆ ఫార్మాట్ లో కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన కోహ్లి.. ఇటీవలే దక్షిణాఫ్రికా తో ముగిసిన టెస్టు సిరీస్  అనంతరం టెస్టులకూ వీడ్కోలు పలికాడు. 

టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగి జట్టులో సీనియర్ ఆటగాడిగా కీలక పాత్ర పోషిస్తున్నాడు. అటు జూనియర్లకు ఇటు సీనియర్లకు వారధిగా ఉంటున్నాడు. అయితే కెప్టెన్సీని కోహ్లి వదులుకున్నంత తేలికగా అతడి అభిమానులు మాత్రం వదులుకోవడం లేదు. అతడే తిరిగి కెప్టెన్ గా రావాలని కోరుకుంటున్నారు. విరాట్ తన సొంత గ్రౌండ్ గా భావించే బెంగళూరు లో లంకతో జరుగుతున్న రెండో టెస్టు సందర్భంగా ఫ్యాన్స్ కూడా ఇదే విషయాన్ని నొక్కి వక్కాణిస్తున్నారు.

బెంగళూరు టెస్టు సందర్భంగా గ్రౌండ్ కు వచ్చిన ఇద్దరు పిల్లలు (కోహ్లి అభిమానులు) ఓ ప్లకార్డును పట్టుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. అందులో.. ‘రోహిత్ మా కెప్టెన్ కాదు. గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (గోట్) విరాట్ కోహ్లిని మళ్లీ కెప్టెన్ గా నియమించండి..’ అని రాసి ఉంది. 

ఈ చిన్నారుల తండ్రి వాళ్లు ఫ్లకార్డులు పట్టుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది ట్విట్టర్ లో వైరల్ అయింది. ఇప్పటికే ఉప్పు నిప్పులా ఉన్న కోహ్లి - రోహిత్ శర్మ ఫ్యాన్స్ మధ్య ఈ ఫోటో మరోసారి చర్చకు దారితీసింది. కోహ్లి అభిమానులు ఈ ఫోటోను షేర్ చేస్తూ.. ‘కరెక్ట్.. మేం కోరుకునేది కూడా అదే..’ అని కామెంట్లు పెడుతున్నారు. దీనిపై హిట్ మ్యాన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు వెటరన్ క్రికెటర్ల అభిమానులు మళ్లీ వార్ జోన్ లోకి వచ్చారు. 

Scroll to load tweet…

దీంతో ఆ ఫోటోను షేర్ చేసిన ఓ ట్విట్టర్ యూజర్.. దానిని తొలగించాడు. అంతేగాక తాను కోహ్లిని టెస్టులకు మాత్రమే కెప్టెన్ గా చేయమని సూచించానని, పరిమిత ఓవర్ల క్రికెట్ లో రోహిత్ శర్మ గొప్ప ఆటగాడని రాసుకొచ్చాడు. బెంగళూరు టెస్టులో కోహ్లి, రోహిత్ శర్మల పేర్లతో కూర్చుని ఉన్న ఇద్దరు వ్యక్తుల ఫోటోను షేర్ చేసి ‘ఇక శాంతించండి’ అని ట్వీట్ చేశాడు. రోహిత్ కు వయసు రీత్యా కెఎల్ రాహుల్ ను గానీ రిషభ్ పంత్ ను గానీ టెస్టులలో నియమిస్తే బాగుంటుందని చెప్పుకొచ్చాడు.