RCB IPL 2025 Victory Parade:18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ RCB ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా విధాన సౌధలో కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా జట్టును సత్కరించనుంది.
RCB IPL 2025 Victory Parade: 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుండి తొలిసారిగా ట్రోఫీని గెలుచుకున్న తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు బెంగళూరుకు చేరుకుంది. ఆర్సీబీ ప్లేయర్లకు ఘన స్వాగతం లభించింది. ఆర్సీబీ జట్టు బస్సు నగర రోడ్ల మీదుగా వెళుతుండగా అభిమానుల సందోహం కనిపించింది. బెంగళూరు మొత్తం ఆర్సీబీ జెండాలతో ఎరుపు మయమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మంగళవారం జరిగిన ఐపీఎల్ ఫైనల్లో RCB పంజాబ్ కింగ్స్ (PBKS)ను ఆరు పరుగుల తేడాతో ఓడించించి ఐపీఎల్ 2025 టైటిల్ ను గెలుచుకుంది.
18 ఏళ్ల నిరీక్షణకు తెర
ఆర్సీబీ ఐపీఎల్ ప్రారంభం నుంచి ఇప్పుడు తమ తొలి టైటిల్ ను గెలుచుకుంది. 18 ఏళ్ల ట్రోఫీ నిరీక్షణకు తెరదించింది. "18 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం. ఇది కర్ణాటక ప్రజలకోసం, కెన్నడిగుల కోరిక నెరవేర్చిన రోజు," అని ఒక అభిమాని భావోద్వేగంతో మీడియాతో మాట్లాడాడు. "ఈ విజయం వారికి ఎంత కష్టంగా సాధించిందో అందరికీ తెలుసు. ఇప్పుడు అసాధారణమైన మైలురాయిని చేరుకున్నారు" అని తెలిపాడు.
రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహిస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చెప్పారు. "ఈరోజు సాయంత్రం 4 గంటలకు విధాన సౌధలో కార్యక్రమం ఉంది. నేను గవర్నర్, మంత్రులతో కలిసి కార్యక్రమంలో పాల్గొంటాను" అని ఆయన అన్నారు. విధాన సౌధ మెట్లపై కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా RCB ఆటగాళ్లను సత్కరిస్తుంది. 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ RCB ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్నందున ఈ కార్యక్రమం రాష్ట్రానికి, దాని అభిమానులకు గర్వకారణంగా నిలుస్తోంది.
