Reasons for Punjab Kings' defeat: ఆర్సీబీ ఐపీఎల్ 2025 ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌పై 6 పరుగుల తేడాతో విజయం సాధించి తమ మొదటి టైటిల్‌ను గెలుచుకుంది. అయితే, పంజాబ్ కింగ్స్ ఓటమికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Reasons for Punjab Kings' defeat: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జూన్ 3న జరిగిన ఐపీఎల్ 2025 ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తమ తొలి టైటిల్‌ను గెలుచుకుంది. పంజాబ్ కింగ్స్ (PBKS)పై 6 పరుగుల తేడాతో గెలిచి ఆర్సీబీ చరిత్ర సృష్టించింది.

ఆర్సీబీ చేతిలో పంజాబ్ ఓటమికి ప్రధాన కారణాలు

1. ఆర్సీబీ బిగ్ స్కోర్

టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 190/9 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 43 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జితేశ్ శర్మ 10 బంతుల్లో 24 పరుగులు చేసి వేగంగా పరుగులు చేశాడు. ఇది మొదట సాధారణ స్కోరుగా అనిపించినా, ఆర్సీబీ బౌలింగ్, ఫీల్డింగ్ లో అద్భుత ప్రదర్శనతో పంజాబ్ కు మరింత భారీ స్కోర్ గా మారింది.

2. మిడిల్ ఓవర్లలో పంజాబ్ పై ఆర్సీబీ బౌలర్ల ఒత్తిడి

పంజాబ్ ఓపెనర్లు ప్రియంష్ ఆర్య (24 పరుగులు), ప్రభ్‌సిమ్రన్ సింగ్ (26 పరుగులు) బాగానే ఆరంభించారు. అయితే కృనాల్ పాండ్యా మిడిల్ ఓవర్లలో అద్భుతమైన బౌలింగ్ తో కీలకమైన ప్రభ్‌సిమ్రన్, జోష్ ఇంగ్లిస్ వికెట్లు తీశాడు. అతని 4 ఓవర్లలో కేవలం 17 పరుగులే ఇచ్చాడు. దీని ఫలితంగా పంజాబ్ రన్ రేట్ తగ్గిపోయింది.

3. కీలక సమయంలో వికెట్లు కోల్పోవడం

ఓపెనర్ల తర్వాత శ్రేయస్ అయ్యర్ (1), నేహాల్ వధేరా (15) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకోయారు. మ్యాచును మలుపు తిప్పే స్కోర్లు చేయలేకపోయారు. ఈ వికెట్లు పడటంతో పెద్ద భాగస్వామ్యాలు రాలేదు. ఆ తర్వాత కూడా వరుసగా వికెట్లు కోల్పోయింది పంజాబ్.

4. డెత్ ఓవర్లలో ఆర్సీబీ మంచి బౌలింగ్

ఆఖరి ఓవర్లలో భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హేజిల్ వుడ్ లు బౌండరీలు ఇవ్వకుండా బౌలింగ్ చేశారు. శశాంక్ సింగ్ అద్భుతంగా 61 (30 బంతులు) చేసి పోరాడినా, మిగతా బ్యాటర్ల మద్దతు లేకపోవడంతో విజయం అందకుండా పోయింది.

5. పెద్ద భాగస్వామ్యాలు లేకపోవడం

పంజాబ్ ఇన్నింగ్స్‌లో ఒక్క 50 పరుగుల భాగస్వామ్యం కూడా నమోదు కాలేదు. భాగస్వామ్యాలు లేకపోవడంతో స్కోరుబోర్డు పై ప్రభావం పడింది. బ్యాటర్లపై ఒత్తిడితో వికెట్లు కోల్పోయారు.

పంజాబ్ కింగ్స్ ఆటలో కొన్ని మెరుగైన ప్రదర్శనలు ఉన్నా, మిడిల్ ఓవర్లలో స్కోరింగ్ తగ్గిపోవడం, కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం, భాగస్వామ్యాల లోపం వంటివి ఓటమికి దారితీశాయి. మరోవైపు, ఆర్సీబీ బౌలింగ్, ఫీల్డింగ్‌లో అద్భుతంగా ఆడి, తమ 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఐపీఎల్ టైటిల్ ను సాధించింది.