Ravindra Jadeja : రిటైర్మెంట్ ప్రకటించిన భారత స్టార్ ఆల్‌రౌండర్..
Ravindra Jadeja retirement : వెస్టిండీస్ లోని బార్బడోస్ వేదికగా శనివారం జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి ఛాంపియన్ గా నిలిచింది. దీంతో భారత్ ఒక్క ఓటమి లేకుండా టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని అందుకుని చరిత్ర సృష్టించింది.
Ravindra Jadeja retirement : ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయంతో టీమిండియా టీ20 ప్రపంచ కప్ 2024 ఛాంపియన్ గా నిలిచింది. ఈ విజయం తర్వాత భారత సీనియన్ స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు అంతర్జాతీయ టీ20 క్రికెట్ కు వీడ్కోలు పలికారు. ఈ క్రమంలోనే టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సైతం టీ20 క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.దీంతో దక్షిణాఫ్రికాపై భారత్ ఏడు పరుగులతో ఉత్కంఠభరితమైన విజయం సాధించిన తర్వాత అంతర్జాతీయ పొట్టి క్రికెట్ ఫార్మాట్ కు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో కలిసి జడేజా జూన్ 29, శనివారం బార్బడోస్‌లో 2024 ప్రపంచ కప్ ఎడిషన్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ వీరికి చివరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్.
సౌరాష్ట్రకు చెందిన 35 ఏళ్ల స్పిన్ ఆల్ రౌండర్ జడేజా ఇటీవలి అనేక ఐసీసీ టోర్నమెంట్ లలో భారత్ జట్టు తరఫున ఆడాడు. టీ20 ప్రపంచ కప్ 2024 లో 8 మ్యాచ్‌లలో భారత్ తరఫున ఆడి ఒక వికెట్ తీసుకోవడంతో పాటు 35 పరుగులు చేశాడు. ఫిబ్రవరి 2009లో అంతర్జాతీయ అరంగేట్రం చేసినప్పటి నుండి జడేజా 74 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లను ఆడాడు. 515 పరుగులు, 54 వికెట్లు తీసుకున్నాడు. టీ20 క్రికెట్ ఛాంపియన్ జట్టులో భాగం కావడం తనను ఎంతో సంతోషం.. గర్వంగా ఉంచిందని తెలిపాడు. టీ20 క్రికెట్ కు వీడ్కోలు పలికిన జడేజా.. టెస్టు, వన్డే క్రికెట్ లో కొనసాగుతానని చెప్పారు.
"కృతజ్ఞతతో నిండిన హృదయంతో నేను టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లకు వీడ్కోలు పలుకుతున్నాను" అని రవీంద్ర జడేజా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నాడు. తాను ఎల్లప్పుడు తన దేశంలో కోసం బెస్ట్ ఇవ్వడానికి ఆడానని పేర్కొన్నాడు. రాబోయే రోజుల్లో కూడా అదే సంకల్పాన్ని కొనసాగిస్తానని తెలిపాడు. టీ20 ప్రపంచకప్‌ను గెలవడంతో ఒక కల నిజమైందనీ, ఇది తన టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో అద్భుతమైన ప్రయాణమని తెలిపాడు. తనకు తన ఈ ప్రయాణంలో తోడుగా ఉంటూ మద్దతు తెలిపిన అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.
అయితే, స్టార్ ఆల్ రౌండ్ కరేబియన్ దీవులు, యూఎస్ఏ వేదికగా జరిగిన టీ20 ప్రపంచ కప్ 2024 లో పెద్దగా ప్రభావం చూపలేదు కానీ అతని తరం అత్యుత్తమ ఆల్ రౌండర్లలో ఒకరిగా చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ లను ఆడాడు. అద్భుతమైన బౌలింగ్, సూపర్ ఫీల్డిండ్, అవసరమైన సమయంలో బ్యాట్ తోనూ పరుగులు చేసి జట్టుకు చాలా సార్లు విజయాలు అందించాడు. అద్భుతమైన ఫీల్డింగ్‌కు పేరుగాంచిన జడేజా టీ20 ప్రపంచకప్ 2024లో 3 క్యాచ్‌లతో పాటు మొత్తంగా టీ20 క్రికెట్ లో 28 క్యాచ్‌లు అందుకున్నాడు.
శనివారం కెన్సింగ్టన్ ఓవల్‌లో భారత్ విజయం సాధించిన తర్వాత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కూడా అంతర్జాతీయ టీ20 క్రికెట్ కు వీడ్కోలు పలుకుతూ తమ నిర్ణయాన్ని ప్రకటించారు. 76 పరుగులతో టాప్ స్కోరింగ్ చేసినందుకు గానూ ఫైనల్‌లో కోహ్లి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో టాప్ స్కోరర్‌గా తన కెరీర్‌ను వీడ్కోలు పలికాడు. రోహిత్ మూడు అర్ధసెంచరీల సహాయంతో 257 పరుగులతో టోర్నమెంట్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. అలాగే, కోహ్లీ ఆల్-టైమ్ రికార్డును అధిగమించి టీ20 క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా ఘనత సాధించి టీ20 క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు.