సారాంశం

ఉత్తరప్రదేశ్ జట్టుపై ట్రిపుల్ సెంచరీ సాధించి దిగ్గజాల సరసన నిలిచిన సర్ఫరాజ్ ఖాన్ మరో ఫీట్ సాధించాడు. తద్వారా ఆ ఫీట్ సాధించిన రెండో బ్యాట్స్ మన్ గా నిలిచాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో డబ్ల్యూవీ రామన్ తర్వాత ఆ ఫీట్ సాధించింది సర్ఫరాజ్ ఖాన్ మాత్రమే

ధర్మశాల: రంజీ ట్రోఫీలో ముంబై జట్టుకు ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్ దూకుడు ఆగడం లేదు. ఉత్తరప్రదేశ్ జట్టుపై ట్రిపుల్ సెంచరీ సాధించి దిగ్గజాల సరసన నిలిచన అతను తాజాగా హిమాచల్ ప్రదేశ్ జట్టుపై డబుల్ సెంచరీ చేశాడు. సోమవారం హిమాచల్ ప్రదేశ్ పై జరిగిన మ్యాచులో 199 బంతుల్లో డబుల్ సెంచరీ చేశాడు.

ముంబై 16 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో సర్ఫరాజ్ బ్యాట్ తో మరోసారి తన సత్తా చాటి ఆదుకున్నాడు. ఆదిత్య తారే, శుభమ్ రంజానే ఇద్దరితో సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మ్యాచ్ ముగిసే సరికి 226 పరుగులు చేశాడు. ఇందులో 32 ఫోర్లు, 4 సిక్స్ లు ఉన్నాయి. దీంతో ముంబై తొలి రోజు ఆట ఐదు వికెట్ల నష్టానికి 372 పరుగుల వద్ద ముగిసింది.

Also Read: ఎవరీ సర్ఫరాజ్ ఖాన్?: జీవితంలో ఎక్కువ కాలం టెంట్ కిందే, తిండిపోతు

ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ట్రిపుల్ సెంచరీ సాధించిన తర్వాత వెంటనే డబుల్ సెంచరీ చేసిన భారత ఆటగాళ్లలో సర్ఫరాజ్ రెండో ఆటగాడిగా నిలిచాడు. అంతకు ముందు తమిళనాడుకు చెందిన డబ్ల్యూవీ రామన్ ఈ ఫీట్ సాధించాడు. డబ్ల్యువీ రామన్ 1989లో 313 పరుగులు చేసి ఆ తర్వాతి మ్యాచులో 200 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలాడు. 

సర్ఫరాజ్ ఖాన్ ఉత్తరప్రదేశ్ జట్టుపై 301 పరుుగలు చేసి నాటౌట్ గా మిగిలిన విషయం తెలిసిందే. దాంతో ఉత్తరప్రదేశ్ జట్టుతో జరిగిన మ్యాచును ముంబై డ్రా చేయగలిగింది. గత మ్యాచులో ట్రిపుల్ సెంచరీ చేసిన సర్ఫరాజ్ ఖాన్ సునీల్ గవాస్కర్, సంజయ్ మంజ్రేకర్, వాసీం జాఫర్, రోహిత్ శర్మ, విజయ్ మర్చెంట్, అజిత్ వాడేకర్ సరసన నిలిచిన విషయం తెలిసిందే.

Also Read: సర్ఫరాజ్ ఖాన్ కు దగ్గు, జ్వరం: అయినా 300 బాదేశాడు