Rahul Dravid: నేను ఇంకా సంతకం చేయలేదు.. టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ కాకపోతే మరి ఇంకెవ్వరు..?
BCCI: బీసీసీఐ ప్రకారం రాహుల్ ద్రావిడ్ రెన్యువల్ కాంట్రాక్ట్ భారత జట్టు అన్ని ఫార్మట్ ల సౌతాఫ్రికా పర్యటనతో ప్రారంభం కానుంది. మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టు ఆఫ్రికా గడ్డపై పర్యటించనుంది.
Rahul Dravid: టీమిండియా ప్రధాన కోచ్ గా రాహుల్ ద్రవిడ్, అతని కోచింగ్ సిబ్బంది పదవీకాలాన్ని పొడిగిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయం తీసుకుంది. దీని గురించి అధికారికంగ ప్రకటన కూడా చేసింది. అయితే, తాజాగా రాహుల్ ద్రావిడ్ చేసిన వ్యాఖ్యలు టీమిండియా కోచ్ పదవిపై మరింత ఉత్కంఠను పేంచాయి. ఇటీవల ముగిసిన ఐసీసీ క్రికెట్ వన్డే వరల్డ్ కప్ లో భారత్ వరుస పది విజయాలతో ఫైనల్ కు చేరుకుంది. భారత ఆటగాళ్లు సైతం వ్యక్తిగతంగా మెరుగైన ప్రదర్శన చేశారు.
ఈ సక్సెస్ వెనుక టీమిండియా కోచ్ గా ఉన్న రాహుల్ ద్రావిడ్ పాత్ర చాలా వుందని చెప్పడంలో సందేహంలేదు. ఈ క్రమంలోనే భారత జట్టు కోచ్ గా ద్రావిడ్ పదవీ కాలం ముగియడంతో పొడిగించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అయితే, దీనికి సంబంధించి బీసీసీఐ నుంచి మరోసారి ఎలాంటి ప్రకటన రాకపోవడం, రాహుల్ ద్రావిడ్ సైతం తన కాంట్రాక్ట్ పొడిగింపు కాలపరిమితిపై కూడా ఎలాంటి వివరాలు వెల్లడించకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతోంది.
ఈ క్రమంలోనే వార్తాసంస్థ పీటీఐతో ద్రావిడ్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ టీమిండియా ప్రధాన కోచ్ ఎవరనేదానిపై మరింత ఉత్కంఠను పెంచాయి. దక్షిణాఫ్రికా సిరీస్ కోసం భారత జట్లను ఎంపిక చేయడానికి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ను కలిసిన ద్రవిడ్ తాను అధికారిక పత్రంపై సంతకం చేయలేదని పేర్కొన్నాడు. 'అధికారికంగా ఏమీ బయటకు రాలేదు. నేను ఇంకా దేనిపైనా సంతకం చేయలేదు, కాబట్టి నాకు పత్రాలు వచ్చిన తర్వాత, మేము దానిపై చర్చిస్తాము" అని ద్రావిడ్ ఢిల్లీలో తన సమావేశం తర్వాత విలేకరులతో అన్నారు. దీంతో మరోసారి టీమిండియా కోచ్ అంశం హాట్ టాపిక్ గా మారింది.