India win 5th ICC U-19 World Cup: అంటిగ్వా వేదికగా ముగిసిన ప్రపంచకప్ ఫైనల్లో భారత జైత్రయాత్రను కొనసాగిస్తూ ఐదో సారి విశ్వ విజేతగా నిలిపిన కుర్రాళ్లపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
దేశానికి ఐదో ప్రపంచకప్ అందించిన భారత కుర్రాళ్లకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. భారత క్రికెట్ భవిష్యత్తు కూడా సురక్షితంగా ఉందని ఆయన పేర్కొన్నారు. శనివారం ముగసిన ప్రపంచకప్ ఫైనల్ లో యశ్ ధుల్ సారథ్యంలోని టీమిండియా.. ఇంగ్లాండ్ ను చిత్తు చేసి ఐదో ప్రపంచకప్ గెలిచింది. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా మోడీ.. టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు.
మోడీ స్పందిస్తూ... ‘యువ క్రికెటర్లను చూస్తే చాలా గర్వంగా ఉంది. ఐసీసీస అండర్-19 ప్రపంచకప్ గెలిచిన టీమిండియా కు అభినందనలు. ఈ టోర్నీ ఆసాంతం వాళ్లు గొప్పగా ఆడారు. అత్యున్నత స్థాయిలో మెరుగైన ప్రదర్శనలు చేసిన వారిని చూస్తుంటే భారత క్రికెట్ భవిష్యత్తు సురక్షితంగా, సమర్థుల చేతుల్లో ఉందని అనిపిస్తున్నది..’ అని ట్వీట్ చేశారు.
శనివారం వివిన్ రిచర్డ్స్ స్టేడియంలో ఇంగ్లాండ్ తో ముగిసిన ఫైనల్ లో భారత జట్టు 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలుత ఇంగ్లాండ్ ను 189 పరుగులకే కట్టడి చేసిన భారత్.. తర్వాత 47.4 ఓవర్లలో విజయలక్ష్యాన్ని నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచులో ఐదు వికెట్లు తీసిన రాజ్ బవకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
కాగా.. భారత జట్టు విజయంపై అసోం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ కూడా స్పందించారు. ట్విట్టర్ వేదిగా ఆయన భారత జట్టుకు అభినందనలు తెలిపారు. ‘అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు నా హృదయపూర్వక అభినందనలు. ఈ విజయం మనకు ఎంతో గర్వకారణం. భారత కీర్తి కిరీటంలో మరో కీర్తిని చేర్చారు. వెల్ డన్ బాయ్స్..’ అని ట్వీట్ చేశారు.
యశ్ ధుల్ సారథ్యంలోని భారత జట్టు.. ప్రపంచకప్ గెలవడం ద్వారా అరుదైన ఘనతను సాధించింది. గతంలో 2000, 2008, 2012, 2018 లో టీమిండియాకు ప్రపంచకప్ అందించిన జట్ల సరసన చేరింది. కాగా ప్రపంచకప్ నెగ్గిన జట్టులోని ఒక్కో సభ్యుడికి రూ. 40 లక్షలు, సహాయక సిబ్బందికి రూ. 25 లక్షల చొప్పున బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు సౌరవ్ గంగూలీ, జై షా ట్వీట్ చేశారు.
సంక్షిప్త స్కోర్లు : ఇంగ్లాండ్ : 44.5 ఓవర్లలో 189 ఆలౌట్
ఇండియా : 47.4 ఓవర్లలో 195/6
