ఫలితం ఎలా ఉన్నా మ్యాచ్‌కు ముందూ, తర్వాత పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ దగ్గరకు వెళ్లి మరీ నాటి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ముచ్చటించడం క్రికెట్ ప్రేమికులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది.
ప్రపంచ క్రికెట్ లో అత్యంత వేగంగా ఎదుగుతున్న క్రికెటర్లలో మహ్మద్ రిజ్వాన్ ఒకరు. అంతర్జాతీయ క్రికెట్ లో ఇప్పటికే ఈ క్రికెటర్ తనదైన ముద్ర వేశారు. 2021 T20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టుతో భారత క్రికెట్ జట్టు మ్యాచ్ సందర్భంగా, రిజ్వాన్ అజేయంగా 79 పరుగులతో అత్యధిక స్కోరు సాధించి తన జట్టును 10 వికెట్ల విజయానికి తీసుకెళ్లాడు.
2021 టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఘోర ఓటమిని చవిచూసింది. 10 వికెట్ల తేడాతో ఓడడంతో వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి భారత్‌పై పాకిస్తాన్ గెలిచినట్టయింది. అయితే ఫలితం ఎలా ఉన్నా మ్యాచ్‌కు ముందూ, తర్వాత పాకిస్తాన్ స్టార్ బ్యాట్స్‌మెన్, వికెట్ కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ దగ్గరకు వెళ్లి మరీ నాటి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ముచ్చటించడం క్రికెట్ ప్రేమికులను ప్రత్యేకంగా ఆకట్టుకుంది.
ఈ స్టార్ క్రికెటర్లు ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారనేదానిపై సోషల్ మీడియాలో అప్పట్లో సరదా చర్చలే జరిగాయి. అయితే ఏం మాట్లాడుకున్నారనేదానిపై ఇటు కోహ్లీ, అటు రిజ్వాన్ ఎప్పుడూ స్పందించలేదు. అయితే తాజాగా యూట్యూబ్ షో ‘క్రికెట్ బజ్ విత్ వహీద్ ఖాన్’తో సంభాషిస్తూ రిజ్వాన్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు.
కోహ్లీని కలవకముందు అతని గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్పారని రిజ్వాన్ పేర్కొన్నాడు. కోహ్లీ కి పొగరు ఎక్కువ అని చెప్పారని.. మైదానంలో ఉన్నట్లే బయట కూడా ఉంటాడని చెప్పారని అన్నాడు.
‘‘ నేను కోహ్లీని కలవడం అదే మొదటిసారి. నేను విన్నది.. ఇతర ఆటగాళ్లు చెప్పినదాన్నిబట్టి.. మైదానంలో కోహ్లీ పొగరుగా ఉంటాడు. అతడి చేష్టలు అలాగే ఉంటాయి. కానీ మ్యాచ్‌కు ముందు, తర్వాత నాతో కోహ్లీ మాట్లాడిన తీరును బట్టి అంతా ఒకే కుటుంబానికి చెందినవాళ్లం అనిపించింది. క్రికెటర్లు అందరూ ఒక కుటుంబం లాంటి వాళ్లు. నేను ఒకవేళ ‘మా విరాట్ కోహ్లీ’ అని సంబోధించినా తప్పవుతుందని అనుకోవడం లేదు. ఒక్కసారి మైదానంలోకి దిగితే మా ప్రాధాన్యత స్టార్(పాకిస్తాన్ క్రికెట్ టీం చిహ్నం). దేశం కోసమే ఆడాల్సి ఉంటుంది. సోదరభావం లేదా ఇతర బంధాలకు తావుండదు.’’ అని రిజ్వాన్ గుర్తుచేసుకున్నాడు.
కాగా ప్రపంచ క్రికెట్‌లో మొహమ్మద్ రిజ్వాన్ వేగంగా స్టార్‌డమ్ సంపాదించుకున్నాడు. గత రెండేళ్లలో అంతర్జాతీయ క్రికెట్‌తో తనదైన ముద్రవేశాడు. గతేడాది టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో 79 పరుగులతో నాటౌట్‌గా నిలిచి పాకిస్తాన్‌కు చరిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టిన విషయం తెలిసిందే. మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ వెళ్లి రిజ్వాన్‌తో ముచ్చటించిన విషయం విధితమే.
