పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు 2019వ సంవత్సరం చాలా కష్టంగా గడిచిందని ఆవేదన వ్యక్తం చేశాడు ఆ జట్టు కోచ్ మిస్బావుల్ హక్. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా చేతుల్లో ఓటమి చవిచూడటం రన్‌రేట్ కారణంగా ప్రపంచకప్‌ సెమీఫైనల్‌కు చేరకపోవడం వంటి ఘటనలు తమను తీవ్రంగా బాధించాయని ఆయన పేర్కొన్నాడు.

ప్రధానంగా టెస్టుల్లో తమ జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేదని మిస్బా అసహనం వ్యక్తం చేశాడు. దాదాపు దశాబ్ధం తర్వాత పాకిస్తాన్‌ వేదికగా టెస్టు సిరీస్‌ జరగడం సంతోషాన్ని ఇచ్చిందన్నాడు.

Also Read:ప్రియురాలితో హార్దిక్ న్యూఇయర్ సంబరాలు... నెటిజన్ల రెస్పాన్స్ ఇదే

లంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో పాక్ గెలుచుకుందని. అయితే అదే జట్టుతో టీ20 సిరీస్‌లో ఓడిపోవడం బాధించిందని మిస్బావుల్ హక్ పేర్కొన్నాడు. టీ20లలో పాక్ ప్రదర్శనపై సంతృప్తికరంగా ఉన్నామని.. టెస్టు ఫార్మాట్లో జట్టు ప్రదర్శన ఏ మాత్రం బాలేదని, దీనిపై తాము దృష్టి పెడతామన్నాడు.

గత కొన్నేళ్లుగా పాక్‌లో టెస్టులు లేకపోవడం వల్ల జట్టులో స్థైర్యం దెబ్బతిందని.. ఏ జట్టుకైనా స్వదేశంలో ఆడితేనే అదనపు బలం కలుగుతుందని మిస్బా అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాదిలోనైనా పాక్‌లో తమ జట్టు ఎక్కువ టెస్టులు ఆడగలిగితే ప్రయోజనం కలిగే అవకాశం ఉందన్నాడు.

Also Read:ఇండియన్ షో చూస్తూ కూతురు "హారతి": టీవీని పగులగొట్టిన ఆఫ్రిదీ, వీడియో వైరల్

ఇక ఆటగాళ్ల ప్రదర్శనపై మిస్బా సంతృప్తి వ్యక్తం చేశాడు. బాబర్ ఆజమ్‌ను ఆకాశానికి ఎత్తేసిన మిస్సావుల్ హక్.. ఫార్మాట్‌తో సంబంధం లేకుండా అతను పరుగుల వరద పారించాడని ప్రశంసించాడు. బాబర్‌తో పాటు నసీమ్ షా, షాహీన్ ఆఫ్రిది ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుందన్నాడు.

త్వరలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ కోసం జట్టును సమాయత్తం చేస్తున్నామని.. ఈ మెగా టోర్నీకి వేదికగా ఉన్న ఆస్ట్రేలియాను దృష్టిలో ఉంచుకుని వ్యూహాలు రచిస్తున్నట్లు మిస్బావుల్ హక్ వ్యాఖ్యానించాడు.