IND vs SA T20Is: దక్షిణాఫ్రికాతో ఐదు టీ20 ల సిరీస్ ను ఈనెల 9 నుంచి ప్రారంభించబోతున్నది టీమిండియా. ఒడిషాలోని కటక్ లో రెండో మ్యాచ్ జరగాల్సి ఉంది. 

ఈ ఏడాది ప్రారంభంలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లి భంగపడ్డ భారత్.. సఫారీ జట్టు మీద ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమవుతున్నది. గురువారం నుంచి భారత్-దక్షిణాఫ్రికా ఐదు టీ20ల సిరీస్ మొదలు కావాల్సి ఉంది. కాగా ఈ సిరీస్ లో భాగంగా రెండో టీ20 ఒడిషాలోని కటక్ లో నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఒడిషా క్రికెట్ అసోసియేషన్ (ఒసీఏ).. తొలి టికెట్ ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కు అందించింది. జూన్ 12 న జరుగబోయే ఈ మ్యాచ్ కు ఆయన వచ్చే అవకాశాలున్నాయి. 

దేశంలో క్రీడలంటే ఆసక్తి కనబరిచి వాటిని ప్రోత్సహించే వారిలో ముందుండే నాయకులలో నవీన్ పట్నాయక్ ఒకరు. 2021 లో జపాన్ లో జరిగిన టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కాంస్యం నెగ్గడంలో ఆయన పాత్ర ఎంతో ఉంది. ఒడిషాలో హాకీ ఆటగాళ్ల కోసం ఆయన ఎన్నో వసతులు కల్పించి వారికి మంచి శిక్షణ ఇప్పించారు. భారత హాకీ జట్టుకు ఒడిషా స్పాన్సర్ షిప్ కూడా చేసిన విషయం తెలిసిందే. 

కాగా తాజాగా ఆయన భారత్-దక్షిణాఫ్రికా మధ్య కటక్ లో జరిగే మ్యాచ్ కు కూడా హాజరుకానున్నారని తెలుస్తున్నది. ఈ మేరకు సోమవారం ఓసీఏ అధ్యక్షుడు లోచన్ మొహంతి, సెక్రటరీ సంజయ్ బెహ్రా లు సీఎంకు తొలి టికెట్ అందించారు. ఈ సందర్భంగా వాళ్లు.. కటక్ స్టేడియంలో తీసుకున్న జాగ్రత్తలు, మ్యాచ్ చూడటానికి వచ్చే ప్రేక్షకులకు కల్పించిన వసతులు వంటివి వివరించారు. 

Scroll to load tweet…

టీమిండియా-సౌతాఫ్రికా టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే.. 

- తొలి టీ20 : జూన్ 9 - ఢిల్లీ 
- రెండో టీ20 : జూన్ 12 - కటక్ 
- మూడో టీ20 : జూన్ 14 - విశాఖపట్నం
- నాలుగో టీ20 : జూన్ 17 - రాజ్కోట 
- ఐదో టీ20 : జూన్ 19 - బెంగళూరు 

ఢిల్లీ మ్యాచ్ కు టికెట్లు ఖతం 

జూన్ 9న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగబోయే తొలి టీ20 కోసం టికెట్లు ఇప్పటికే అమ్ముడుపోయాయని తెలుస్తున్నది. ఇదే విషయమై ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) జాయింట్ సెక్రటరీ రాజన్ మంచంద మాట్లాడుతూ.. ‘94 శాతం టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. ఇంకో నాలుగైదువందల టికెట్లు మాత్రమే బాకీ ఉన్నాయి. మ్యాచ్ ప్రారంభమయ్యేనాటికి అవి కూడా అమ్ముడవుతాయి..’ అని తెలిపాడు.