కొత్త సంవత్సరాన్ని, ఆ మాటకొస్తే ఈ నూతన దశాబ్దాన్ని విదేశీ టెస్టులతో ఆరంభించనుంది టీం ఇండియా.  ఫిబ్రవరి 21, 2020 నుంచి న్యూజిలాండ్‌తో భారత్‌ రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌లో ఆడనుంది. 

ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్స్‌లో ఈ సిరీస్‌ చాలా కీలకం. 120 కీలక పాయింట్లు కలిగిన ఈ సిరీస్‌ భారత్‌ కు ఎంతో ముఖ్యం. ఈ సిరీస్‌లో గనుక విజయం సాధిస్తే 2021 జూన్‌ వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్స్‌ ఫైనల్లో ప్రత్యర్థి కోసమే భారత్‌ ఎదురు చూడాల్సి ఉంటుంది. 

నేడు ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెస్కే ప్రసాద్‌ సారథ్యంలోని సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ న్యూజిలాండ్‌లో పర్యటించనున్న భారత వన్డే, టీ20, టెస్టు జట్లను ఎంపిక చేయనుంది. 

Also read: కంగారూలతో సిరీస్ కు వేళాయెరా.... కోడి పందాలకు ధీటుగా సాగనున్న క్రికెట్ సమరం

న్యూజిలాండ్‌ పర్యటనలో భారత్‌ ఐదు టీ20, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. టీ20 ప్రపంచకప్‌ సమీపిస్తుండగా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌ జట్టులో పెద్దగా మార్పులు చేసేందుకు సెలక్షన్‌ కమిటీ ఇష్టపడక పోవచ్చు. 

ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య పునరాగమనం చేస్తాడనుకున్నప్పటికీ.... అతడు ఫిట్నెస్ సాధించడంలో విఫలమయ్యాడు. చూడాలి ఇంకా సమయం ఉంది కాబట్టి సెలెక్టర్లు అతడికి ఒక అవకాశం ఇచ్చే ఆస్కారం ఉంది. 

టెస్టు జట్టు ఎంపికలో సెలక్షన్‌ కమిటీ ముందు కొన్ని స్వల్ప సవాళ్లు ఉన్నాయి. రోహిత్‌ శర్మ, మయాంక్‌ అగర్వాల్‌లు ఓపెనర్లుగా కుదురుకున్న పరిస్థితుల్లో మూడో ఓపెనర్‌కు ప్రాధాన్యత లేదు. కానీ గాయాల దృష్య్టా బ్యాకప్‌ ఓపెనర్‌ అవసరం. కెఎల్‌ రాహుల్‌ తాజా ఫామ్‌తో ఈ స్థానం ఆశిస్తున్నాడు. హనుమ విహారి మాదిరి మిడిల్‌ ఆర్డర్‌లో స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌గా రాణించగల సామర్థ్యం అదనపు అనుకూలత. 

యువ ఆటగాళ్లలో పృథ్వీ షా, శుభ్‌మన్‌ గిల్‌, ప్రియాంక్‌ పంచల్‌, అభిమన్యు ఈశ్వరన్‌ చోటు ఆశిస్తున్నారు. ఈ రేసులో పృథ్వీ షాది స్పష్టమైన ముందంజ కానీ, గాయంతో షా రేసులో వెనక్కి వెళ్లిపోయాడు. షాకు గాయంతో వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌లతో టెస్టు సిరీస్‌కు శుభ్‌మన్‌ జట్టులోకి వచ్చాడు. అతడే ఆ స్థానం నిలుపుకుంటాడనే అంచనాలు ఉన్నాయి. 

Also read: ఎందుకు ఈ పనికిరాని అనుభవం...? తనపై తానే తీవ్ర విమర్శలు చేసుకున్న మలింగ

రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజాలతో స్పిన్‌ ఆల్‌రౌండర్లతోనే సెలక్షన్‌ కమిటీ వెళ్లనుంది. విదేశీ పర్యటనల్లో ప్రధానంగా ఎదురయ్యే సమస్య ఐదో సీమర్‌ లేదా మూడో స్పిన్నర్‌ ఎవర్ని తీసుకోవాలనే సమస్య.   

సాధారణంగా విదేశీ పర్యటనలకు భారత్‌ 16 మంది జట్టుతో వెళ్తుంది. ఈ దశాబ్దంలో న్యూజిలాండ్‌ పిచ్‌లు చాలా వరకు నెమ్మదించాయి. మునుపటి వేగం ఏమాత్రం కనిపించటం లేదు. చైనామన్‌ కుల్దీప్‌ యాదవ్‌ మూడో స్పిన్నర్‌గా రేసులో ముందున్నాడు. ఐదో సీమర్‌గా నవదీప్‌ సైనికి అవకాశాలు ఉన్నాయి. 

భారత టెస్టు జట్టు (అంచనా) : విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, మయాంక్‌ అగర్వాల్‌, కెఎల్‌ రాహుల్‌, చతేశ్వర్‌ పుజార, అజింక్య రహానె, హనుమ విహారి, వృద్దిమాన్‌ సాహా, రిషబ్‌ పంత్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, జశ్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమి, ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌, కుల్దీప్‌ యాదవ్‌