టీమిండియాతో టీ20 సిరీస్‌ను కనీస పోరాటం కూడా చూపకుండా అప్పనంగా అప్పగించడంపై పై శ్రీలంక కెప్టెన్‌ లసిత్‌ మలింగా తీవ్ర అసంతృప్తిని, ఆవేదనను  వ్యక్తం చేశాడు. తమ జట్టు పూర్తి స్థాయి ప్రదర్శన చేయకపోవడం వల్లనే భారత్‌ చేతిలో ఘోర పరాజయాన్ని చవి చూశామని అభిప్రాయపడ్డాడు మలింగా. 

తన వ్యక్తిగత ప్రదర్శనను సైతం మలింగ తప్పుబట్టారు. తాను చాలా అనుభవం ఉన్న క్రికెటర్‌నని, తనకు చాలా అంతర్జాతీయ టీ20లు ఆడిన అనుభవం ఉందని తెలిపాడు.  వికెట్‌ టేకింగ్‌ బౌలర్‌ ని అయినప్పటికీ, భారత్‌తో పోరులో కనీసం ఒక వికెట్‌ కూడా తీయలేకపోయానని, అలా వికెట్లను సాధించలేక ఒత్తిడికి లోనయ్యానని మలింగా అన్నాడు. 

క్రికెట్‌లో చాలా మ్యాచ్‌లో ఆడినా భారత్‌తో సిరీస్‌ ఆఖరి రోజు ముగిసే సరికి తన అనుభవం అవసరానికి పనికిరాలేదని మలింగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.  కెప్టెన్సీ కూడా తన ప్రదర్శనపై పై ప్రభావం చూపిందన్నాడు. 

జట్టుగా  శ్రీలంక ఆశించిన స్థాయిలో లేకపోవడమే కెప్టెన్‌గా తనపై ఒత్తిడి పెంచిందని, అదే తన ప్రదర్శనపై కూడా ప్రభావం చూపిందని అన్నాడు. 2014లో కెప్టెన్‌గా ఉన్న సమయంలో అప్పుడు పెద్దగా భారం అనిపించలేదని,  జట్టులో అనుభవం ఉన్న ఆటగాళ్లు ఉండటం వాళ్ళ అప్పుడు ఆ భారం తెలియలేదని మలింగ అభిప్రాయపడ్డాడు. 

కుమార సంగక్కర, జయవర్ధనే, దిల్షాన్‌ వంటి దిగ్గజ క్రికెటర్లు అప్పుడు జట్టులో ఉండటం వల్ల కెప్టెన్సీ భారం తెలిసేది కాదని వ్యాఖ్యానించాడు.  టీ20ల్లో భాగస్వామ్య విలువ చాలా గొప్పదని, దాని విలువ తమ జట్టు ఆటగాళ్లు గుర్తించలేకపోయారని, భాగస్వామ్యాలను నెలకొల్పడంలో విఫలమయ్యారని మలింగ అభిప్రాయపడ్డాడు. 

ఒకవైపేమో భారత ఆటగాళ్లు దుర్భేద్యమైన భాగస్వామ్యాలను నెలకొల్పుతుంటే... తమ ఆటగాళ్లు మాత్రం విఫలమయ్యారని ఆయన వ్యాఖ్యానించాడు. టీ20ల్లో ప‍్రతీ బంతి కూడా అత్యంత విలువైనదని, బంతులను వేస్ట్ చేయొద్దని, ప్రతీ బంతికి కనీసం ఒక సింగిల్‌ అయినా తీయాలని అభిప్రాయపడ్డాడు. 

ఇక టీం ఇండియా బ్యాటింగ్ పై కూడా ప్రశంసల వర్షం కురిపించాడు మలింగ . భారత బ్యాట్స్ మెన్ షాట్లు కొడుతూ ఇన్నింగ్స్‌ను నడిపించిన తీరు అద్భుతంగా ఉందని కొనియాడాడు. దాదాపు ఏడాదిన్నర కాలం నుంచి తమ ప్రదర్శన ఇలానే చెత్తగా సాగుతుందని, మెరుగపడిన దాఖలాలు లేవని మలింగ ఆవేదన వ్యక్తం చేసాడు. 

గత లంక జట్టుకు ఇప్పటి లంక జట్టును పోల్చి చూసి వాటి మధ్య తేడాలను స్పష్టంగా ఎత్తి చూపదు మలింగ . గతంలో శ్రీలంక జట్టు అంటే పటిష్టంగా ఉండేదని, కుమార సంగక్కర, మహేలా జయవర్ధననే, దిల్షాన్‌లు లంకకు ఎన్నో విజయాలు అందించారని గుర్తు చేసాడు. ప్రస్తుత జట్టులో అది కొరవడిందనే విషయం ఒప్పుకోవాల్సిందేనన్నాడు మలింగ.