సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఎవరైనా ఆటగాడు గాయం కారణంగానో.. లేదా ఇతరత్రా కారణాల వల్ల మైదానం వీడితే అతని స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా మరో ఆటగాడు ఫీల్డర్‌గా వస్తుంటాడు. ఇది తరచుగా జరిగేదే.

అయితే భారత్ - న్యూజిలాండ్‌ల మధ్య ఆక్లాండ్‌లో జరిగిన రెండో వన్డేలో ఇందుకు భిన్నంగా కివీస్ అసిస్టెంట్ కోచ్ ల్యూక్ రోంచి సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా అవతారం ఎత్తి అందరి దృష్టిని ఆకర్షించాడు.

Also Read:అతని బౌలింగ్‌ అంటే భయపడుతున్న కోహ్లీ: ఏకంగా 9 సార్లు ఔట్

పేసర్ టీమ్ సౌథీ అనారోగ్యంతో బాధపడుతుండటంతో తన కోటా ఓవర్లు పూర్తి చేసి పెవిలియన్‌కే చేరాడు. అతని స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగేందుకు న్యూజిలాండ్ రిజర్వ్ బెంచ్‌లోని ఆటగాళ్లు ఎవరూ ఫిట్‌గా లేరు. దీంతో తప్పనిసరి పరిస్ధితుల్లో రోంచి మైదానంలోకి దిగాల్సి వచ్చింది.

అయితే జట్టు తరపున కోచ్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలోకి దిగడం ఇదే తొలిసారి కాదు... గతంలో ఎన్నోసార్లు కోచ్‌లు ఫీల్డింగ్ చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. 2019 ప్రపంచకప్ సందర్భంగా ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా వార్మప్ మ్యాచ్ సందర్భంగా సబ్‌స్టిట్యూట్ ఫిల్డర్‌ ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఇంగ్లీష్ జట్టు సహాయక కోచ్ పాల్ కాలింగ్‌వుడ్ ఫీల్డింగ్‌ చేసిన సంగతి తెలిసిందే.

Also Read:నీ.. దూకుడు: అలా ఎలా కుదురుతుంది... ఫీల్డ్ అంపైర్‌తో విరాట్ కోహ్లీ గొడవ

రెండో వన్డేలో భారత్‌పై న్యూజిలాండ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 273 పరుగులు చేయగా... అనంతరం బరిలోకి దిగిన భారత్ 22 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సూపర్ ఇన్నింగ్స్‌తో జట్టును విజయానికి దగ్గరగా తీసుకొచ్చినా.. కివీస్ బౌలర్ల ముందు నిలబడలేకపోయాడు. దీంతో న్యూజిలాండ్ 2-0 తేడాతో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది.